
జిల్లాలో కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు
వేలూరు: జిల్లాలో కరోనా వ్యాపించకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. మంగళవారం ఉదయం వేలూరు తొర్రపాడిలోని తందై పెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో రూ.2.33 కోట్ల వ్యయంతో తరగతి గదుల నిర్మాణం కోసం సీఎం స్టాలిన్ చైన్నె సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ చేశారు. దీంతో కలెక్టర్ సుబ్బలక్ష్మి వేలూరులో పూజలు చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వారం జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్షించి, డెంగీ, మలేరియా, తదితర వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బందితో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల కరోనా వ్యాపిస్తుందని సమాచారం వచ్చిందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం వద్ద నుంచి ఇంత వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని వైద్యాధికారులతో సంప్రదించి, నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున పంటలు, వంకలు, వాగులు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సంబంధిత అఽధికారులతో సమీక్షించి, అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, అధికారులు పాల్గొన్నారు.