
‘నైరుతి’ ఆశలు..
● ఆశాజనకంగా పవనాల కదలిక ● 24న రాష్ట్రాన్ని తాకే అవకాశం ● కావేరి పరవళ్లు ● మేట్టూరులోకి పెరిగిన నీటి రాక ● గోడ కూలి..ముగ్గురి మృతి
సాక్షి, చైన్నె : నైరుతి రుతు పవనాల కదలిక ఆశాజనకంగా మారింది. ఈ రుతు పవనాలు ఈ నెల 24వ తేదీన లేదా 25వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఇందుకు శుభసూచకంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా, మరికొన్ని జిల్లాల్లో కుండ పోతగా వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో ఏటా నైరుతి రుతు పవనాల ప్రభావం అంతంత మాత్రమే. అయితే కేరళ, కర్ణాటకల్లో ఈ పవనాల రూపంలో వర్షాలు పడితే తమిళనాడులోని అన్నదాతలకు ఆనందమే. కేరళ నుంచి ముల్‌లై పెరియార్, వైగై, భవానీ సాగర్ జలాశయాలకు నీటి రాక పెరుగుతుంది. కర్ణాటకలో వర్షాలు కురిస్తే, కావేరి పరవళ్లు తొక్కినట్టే. అదే సమయంలో ఈ ఏడాది భానుడి ప్రతాపం మరీ ఎక్కువగానే రాష్ట్రంలో ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ దృష్ట్యా జల వనరులలో ప్రస్తుతం నీటి శాతం కూడా తగ్గి ఉంది. దీంతో నైరుతిపై ఆశలు మొదలయ్యాయి. సంవృద్ధిగా ఈ సారైనా వర్షాలు కురవాలని ప్రజలు ఎదురు చూశారు. ఇందుకు అనుగుణంగానే సమాచారాలు వెలువడ్డాయి.
ముందుగానే నైరుతి ప్రవేశం
నైరుతి రుతు పవనాలు ఇప్పటికే అండమాన్ తీరాన్ని తాకాయి. ఆశాజనకంగా ఈ పవనాలు కదులుతూ కేరళ తీరాన్ని మరికొద్ది రోజుల్లో తాకనున్నాయి. ఈ పవనాలు ఈనెల 28వ తేదీ తర్వాత తమిళనాడులోకి ప్రవేశించవచ్చని భావించారు. అయితే, ముందుగానే ఈనెల 24 లేదా 25 తేదీల్లో పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఈ పవనాలతో తమిళనాడు– కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్ కాశి, తేని, కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్ జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగా కురిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి చెదరుమదురుగా వర్షాలు పడుతున్నాయి. అలాగే, పశ్చిమ కనుమలలోని కోయంబత్తూరు, ఈరోడ్, నీలగిరి జిల్లాల్లోనూ బుధవారం నుంచి మరింతగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. డెల్టా, పశ్చిమ కనుమలతో పాటుగా 12 జిల్లాలో వర్షాలు పడనున్నాయి. కావేరి నదిలో నీటి ఉధృతి పెరిగింది. మేట్టూరు జలాశయంలోకి సెకనుకు పది వేల క్యూసెక్కుల నీరు ప్రవేశిస్తుంది. దీంతో జలాశయం నీటి మట్టం బుధవారం నాటికి 110 అడుగులకు చేరనుంది. కర్ణాటకలో మరింతగా భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి నీటి రాక కావేరిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కావేరి తీరంలో అలర్ట్ ప్రకటించారు.
చైన్నె శివారులో..
చైన్నె శివారులో మంగళవారం భారీ వర్షం కురిసింది. విమానాశ్రయం పరిసరాల నుంచి తాంబరం, చెంగల్పట్టు వైపుగా, కాంచీపురం వైపుగా గంటకు పైగా కుండ పోత వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదలా నీరు పారింది. వాహన చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. అదే సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో చైన్నెలో ల్యాండ్ కావాల్సిన పది విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. వాతావరణం మారిన అనంతరం ల్యాండింగ్ అయ్యాయి. మదురై పరిసరాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మదురై తిరుప్పర కుండ్రం సమీపంలోని పెరుంగుడి గ్రామంలో ఓ ఇంటి గోడ కూలింది. ఆ ఇంట్లో ఉన్న అమ్మా పిల్‌లై(65), వెంకటి(55)తో పాటుగా వీరమణి అనే బాలుడు మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.

‘నైరుతి’ ఆశలు..

‘నైరుతి’ ఆశలు..