
షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ..
స్పృహతప్పి పడి ఆర్మీ అధికారి మృతి
అన్నానగర్: కశ్మీర్‌కు చెందిన ఉమాంగర్ (28) పరంగిమలైలోని ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈనెల 16న అతను మీనంబాక్కంలోని కేంద్రంలో షూటింగ్ శిక్షణలో పాల్గొన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఉమాంగర్ స్పృహతప్పి పడిపోయాడు. ఇతర సైనిక అధికారులు వెంటనే అతన్ని చికిత్స కోసం బరంగేహిల్‌లోని సైనిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఉమాంగర్ మంగళవారం తెల్లవారుజామున మరణించారు. ఎండదెబ్బ ప్రభావం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు గురై అతడు చెందినట్లు తెలుస్తుంది. మీనంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలేదు
● ప్రజలు భయపడాల్సిన పనిలేదు
కొరుక్కుపేట: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలేదని ప్రజలు భయపడవద్దని తమిళనాడు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన కరోనా, ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభావాన్ని చూపింది. అయితే, తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలుతోపాటూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడం, టీకాలు విస్తృతంగా అందించడం ద్వారా, కరోనా మహమ్మారిని తరిమికొట్టామన్నారు. కాగా ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా, ప్రభావితమైన వ్యక్తులలో ఎటువంటి తీవ్రమైన లక్షణాలు కనిపించలేదు. కరోనా వైరస్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదన్నారు. అయితే సాధారణ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలి, సరైన ఇన్ఫెక్షన్ నివారణ చర్యలను పాటించాలి. లక్షణాలు ఉన్నవారు, ముఖ్యంగా జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నవారు సమీపంలోని వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలని కోరారు.
పది, ప్లస్–1 సప్లిమెంటరీ పరీక్షకు 22 నుంచి దరఖాస్తులు
కొరుక్కుపేట: పదో తరగతి, ప్లస్–1 సప్లిమెంటరీ పరీక్షకు 22వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి, ప్లస్–1 తరగతుల విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు జూలై 4 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షకు పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు, పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు ఈనెల 22వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ దరఖాస్తులు అందజేయడానికి జూన్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని తెలిపింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు జిల్లాల వారీగా ప్రభుత్వ పరీక్షా సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష రుసుం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ రుసుం నగదు రూపంలో చెల్లించాలని పేర్కొంది. అలాగే స్పెషల్ అడ్మిషన్ స్కీమ్ (తత్కాల్) కోసం దరఖాస్తులను జూన్ 5, 6 తేదీలలో పాఠశాల సేవా కేంద్రాలలో తగిన రుసుముతో ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని పేర్కొంది. ప్రత్యేక ప్రవేశ రుసుం పదో తరగతికి రూ.500, ప్లస్–1కు రూ.1000గా నిర్ణయించారు. ప్రభుత్వ , ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారికి ఈ రుసుము నుంచి మినహాయింపు ఉంటుందని డైరెక్టరేట్ పేర్కొంది. ఇతర వివరాలకు www.dfe.in.gov.in అనే వెబ్‌సైట్‌లో సంప్రదించాలని తెలిపింది.
అద్దకం పరిశ్రమలో విషవాయువుకు ముగ్గురు బలి
కొరుక్కుపేట: తిరుప్పూరులో ఓ అద్దకం పరిశ్రమలో విషవాయువు పీల్చి ముగ్గురు మృతి చెందారు. తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం సమీపంలోని కరైప్పుదూర్‌లో ఒక ప్రైవేట్ అద్దకం కర్మాగారం పనిచేస్తోంది. ఈ కర్మాగారంలోని డై వేస్ట్ వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడానికి కంపెనీలో పనిచేస్తున్న శరవణన్ (30), వేణుగోపాల్ (31), హరి (26), చిన్నస్వామి (36) అనే నలుగురు వ్యక్తులు దాదాపు 6 అడుగుల లోతున ఉన్న మురుగునీటి ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంక్‌లోకి దిగిన కొద్దిసేపటికే, చిన్నస్వామికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది మొదలైంది. దీంతో బయటకు వచ్చేశారు. శరవణన్, వేణుగోపాల్, హరి శుభ్రపరిచే పనిలో కొనసాగారు. చిన్నస్వామి పైనుంచి దీన్ని పర్యవేక్షిస్తున్నాడు. విషపూరిత వాయువుకు శరవణన్, వేణుగోపాల్, హరి స్పృహ కోల్పోయారు. వెంటనే ఆ ముగ్గురినీ రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ శరవణన్, వేణుగోపాల్ మరణించారు. హరి ప్రాణాపాయ స్థితిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.