
సీఎం స్టాలిన్
‘నీతి ఆయోగ్’కు
● 23న హస్తిన పర్యటన ● జాతీయ స్థాయి నేతలతో భేటీకి ఏర్పాట్లు
సాక్షి, చైన్నె: నిధుల విడుదలలో తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి అనుసరిస్తున్నట్టు ఆది నుంచి రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాము వ్యతిరేకిస్తున్న పథకాలను సైతం అమలు చేయాల్సిందేనని కేంద్రం ఒత్తిడి తీసుకు రావడాన్ని డీఎంకే పాలకులు ఇప్పటికే తీవ్రంగా పరిగణించి ఉన్నారు. అలాగే లోక్‌సభ పునర్విభజన వ్యవహారంలో గానీయండి, నిధుల విడుదల విషయంలో గానీయండి ప్రధాని నరేంద్ర మోదీని ఎంపీల బృందంతో వెళ్లి కలిసేందుకు అనుమతి కోరినా, ఇంత వరకు అవకాశం అన్నది సీఎం స్టాలిన్‌కు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 24వ తేదీన ఢిల్లీ వేదికగా నీతి అయోగ్ భేటీ జరుగుతుండడంతో ఈ సమావేశాన్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో డీఎంకే పాలకులు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో తమ గళాన్ని వినిపించడం లేదా నిరసనను తెలియజేయడానికి అవకాశం దక్కినట్టుగా భావిస్తున్నారు. ఇది వరకు నీతి అయోగ్ భేటీకి ఆర్థిక మంత్రి వెళ్లేవారు. గత ఏడాది అయితే ఏకంగా భేటీని బహిష్కరించారు. అయితే, ఈసారి మాత్రం స్వయంగా తానే ఈ సమావేశానికి వెళ్లేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టి ఉన్నారు. ఈనెల 23వ తేదీన సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. నీతి అయోగ్ భేటీతో పాటూ ఈ సమావేశానికి వచ్చే బీజేపీయేతర ప్రభుత్వాల సీఎంలను ప్రత్యేకంగా భేటీకి కసరత్తులలో ఉన్నారు. పది ముసాయిదాల వ్యవహరంలో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి 14 ప్రశ్నలను సంధిస్తూ లేఖ రాయడాన్ని వ్యతిరేకించే విధంగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే స్టాలిన్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జరగనున్న నీతి అయోగ్‌కు హాజరయ్యే వివిధ రాష్ట్రాల సీఎంలను ఏకం చేసే దిశగా తన పర్యటనకు స్టాలిన్ సన్నద్ధం అవుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
క్వీన్ మేరీ కళాశాలలో..
ప్రారంభోత్సవాలతో బిజీబిజీ
ఢిల్లీ పర్యటన కసరత్తులు ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు మంగళవారం సీఎం స్టాలిన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలలో బిజీ అయ్యారు. తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డు తరపున రూ. 527.84 కోట్లతో నిర్మించిన బహుళ అంతస్తుల తరహాలోని 4,978 ప్లాట్లను ప్రారంభించారు. తమిళనాడు హౌసింగ్ బోర్డు నేతృత్వంలో రూ. 207 కోట్లతో నిర్మించిన నాలుగు బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలను ప్రారంభించారు. ఇందులో అందరికీ గృహనిర్మాణ పథకం కింద చైన్నెలోని కై లాసపురం 14 అంతస్తులతో కూడిన 392 ప్లాట్‌లు , విరుదునగర్ నగర్‌లో మూడు అంతస్తులతో కూడిన పలు టవర్ల అపార్ట్‌మెంట్లలో 864 ప్లాట్లు, మధురై జిల్లాలోని ఉచ్చపట్టిలో మూడు అంతస్తుల కూడిన పలు టవర్ల అపార్ట్‌మెంట్లలో 672 ప్లాట్లు కళ్లకురిచ్చిలో 512, తిరుప్పూర్ 432, కాంచీపురం సాలమంగళంలో 420 ప్లాట్లు ఉన్నాయి. అలాగే, తమిళనాడు హౌసింగ్ బోర్డు చైన్నె నెర్కుండ్రం, సీఐటీ నగర్, మదురై, తోప్పూర్‌లో నిర్మించిన బహుళ అంతస్తులతో కూడిన వాణిజ్య సముదాయ భవనాలు కూడా ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రులు ముత్తుస్వామి, అన్బరసన్, సీఎస్ మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, తమిళనాడు హౌసింగ్ బోర్డు చైర్మన్ పూచ్చి ఎస్‌మురుగన్, తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ మిశ్రా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె. విజయకార్తికేయన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. సమీరన్ పాల్గొన్నారు. అనంతరం చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపున రూ. 14.66 కోట్లతో పూర్తి చేసిన ఐదుప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే, రూ.255.60 కోట్లతో చేపట్టనున్న 20 కొత్త పనులకు శంకుస్థాపన చేశారు.
చైన్నె క్వీన్ మేరీ కళాశాలలో ఉన్నత విద్యా శాఖ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరు అయ్యారు. రూ. 42 కోట్లతో కొత్తగా నిర్మించిన విద్యార్థుల హాస్టల్ భవనంతో సహా ఉన్నత విద్యాశాఖ తరపున 120.02 కోట్లుతో నిరిచిన భవనాలను ప్రారంభించారు. రూ. 207.82 కోట్లు నిర్మించనున్న కొత్త భవనాల స్టాలిన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెలియన్, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్, విల్సన్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సమయమూర్తి తదితరులు పాల్గొన్నారు.ముందుగా వాల్ టాక్స్ రోడ్డులోని బకింగ్ హాం కాలువలో పూడిక తీత పనులను సీఎం పరిశీలించారు. వర్షాల సీజన్ ఆరంభంలోపు పనులు ముగించాలని అధికారులను ఆదేశించారు. కాగా సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను కశ్మీర్ నుంచి వచ్చిన విద్యార్థులు కలిశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కశ్మీర్, సరిహద్దు రాష్ట్రాలలోని విద్యా సంస్థలలో చిక్కుకున్న తమిళ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా ఇక్కడకు రప్పించిన విషయం తెలిసిందే. తమను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చిన సీఎంకు సచివాలయంలో విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సీఎం స్టాలిన్