
ఐదుగురిని బలిగొన్న క్వారీ
సాక్షి, చైన్నె: శివగంగైలో ఓ క్వారీలో మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఐదుగురు కార్మికులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. శివగంగై జిల్లా తిరుపత్తూరు సమీపంలోని మలకోట్టై గ్రామంలో మేఘ వర్ణం అనే వ్యక్తి క్రషర్ క్వారీని నిర్వహిస్తున్నాడు. ఇక్కడ మంగళవారం ఉదయం కార్మికులు విధులలో ఉన్నారు. ఇందులో ఆరుగురు కార్మికులు ఓ చోట పనిచేస్తుండగా హఠాత్తుగా మట్టి చరియలు విరిగి పడ్డాయి. వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. ఇందులో ఒకరు పెట్టిన కేకలతో మిగిలిన వారు పరుగులు తీశారు. మట్టి చరియలు పెద్ద ఎత్తునపడడంతో సహాయక చర్యలకు సంక్లిష్టంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గుర్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరు చికిత్స ఫలించక మరణించారు. మరో ముగ్గురు మట్టి చరియల శిథిలాల క్రింద మరణించారు. వీరి మృతదేహాలను అతి కష్టంపై వెలికి తీశారు. ఈ ఘటన సమాచారంతో మంత్రి పెరియకరుప్పన్, జిల్లా కలెక్టర్ ఆశా అజిత్‌లతో పాటుగా అధికారులుసంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మరణించిన వారిలో స్థానికుడైన ఆండి చామి, గణేషన్ ఉన్నారు. మిగిలిన వారు ఒడిశ్వా కార్మికులుగా భావిస్తున్నారు. వీరి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
● మట్టి చరియలు విరిగి పడడంతో ఘటన

ఐదుగురిని బలిగొన్న క్వారీ