
ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు దరఖాస్తుల హోరు
● 1,61,324 మంది నమోదు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు దరఖాస్తులు హోరెత్తాయి. 1,61,324 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడంతో సీట్లకు డిమాండ్ నెలకొన్నట్లు అయ్యింది. రాష్ట్రంలో 165 ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో డిగ్రీ కోర్సులకు సంబంధించి సుమారు 1.08 లక్షల సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ నిమిత్తం నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి 1,61,324 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 46,691 మంది విద్యార్థులు, 75,959 మంది విద్యార్థినులు, మిగిలిన వారు మూడో కేటగిరికి చెందిన వారు ఉన్నారు. వీరిలో 1,22,698 మంది విద్యార్థులు దరఖాస్తు రుసుం సైతం చెల్లించి ఉన్నారు. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఈ దృష్ట్యా, రెండు లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల కోసం ఉన్నత విద్యాశాఖ హెల్ప్–డెస్క్, విద్యార్థులకు మార్గదర్శకం, అడ్మిషన్ ఫెసిలిటేషన్ సెంటర్లు తదితర వివరాలను తెలియజేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం విద్యార్థులు 044–24342911 నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందేలా టోల్ ఫ్రీ నంబర్‌ను మంగళవారం ప్రకటించింది. అలాగే, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సైనన్స్ కళాశాలల్లో ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రత్యేక కోర్సులను సైతం అందించనున్నారు.
కోర్సులు... కళాశాలలు
కాలేజ్ రెగ్యులర్ ఆర్ట్స్ అండ్ సైనన్స్, మేనేజ్‌మెంట్ కోర్సులతో కూడిన ప్రత్యేకమైన కోర్సులు క్వీన్ మేరీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) అందించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. బ్యాచిలర్ ఆఫ్ జియోగ్రఫీ, టూరిజం, గృహ ఆర్థిక శాస్త్రం, పోషకాహారం, ఆహారసేవ నిర్వహణ, హోమియోపతి, వైద్య పోషకాహారం, ఆహార నియమాలు (హోం సైన్‌న్స్ – క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్), భారతీయ సంగీతం తదితర కోర్సులను కూడా అందించనున్నారు. నందనం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, వ్యాసార్పాడిలోని డాక్టర్ అంబేడ్కర్ గవర్నమెంట్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్– న్యూట్రిషన్, ఆహార సేవా నిర్వహణ, ఆహార వ్యవస్థ (హోం సైన్స్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సర్వీస్ నిర్వహణ ఆహార నియంత్రణ), బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ, విజువల్ కమ్యూనికేష్‌న్‌లో బ్యాచిలర్ డిగ్రీ కమ్యూనికేషన్), కాయిదే ఏ మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)లో బ్యాచిలర్ ఆఫ్ హోమ్ సైన్స్, ఆలందూరు ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ, చైన్నె రాజధాని కళాశాలలో బీఏ భూగర్భ శాస్త్రం, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం బి.కామ్ ,బి.కాం(హియరింగ్ ఇంపెయిర్డ్), బీసీఏ(హియరింగ్) వంటి కోర్సులను అందించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. కాగా, విద్యా పరంగా కొత్త కోర్సులను ప్రకటించినా, అదనపు సీట్లను పెంచినా, ఈ సారి దరఖాస్తులు హోరెత్తుతుండడం చూస్తుంటే, డిగ్రీ కోర్సులకు డిమాండ్ మరింతగా పెరగడం ఖాయమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సీట్లకు డిమాండ్ పెరిగిన పక్షంలో ఇంజినీరింగ్‌కు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు.