ఇళ్లకు వడ్డన ఇల్లే!
● అన్ని రాయితీలు కొనసాగుతాయి ● మంత్రి శివ శంకర్ స్పష్టం
సాక్షి, చైన్నె: గృహాలకు ఎలాంటి విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని, అన్ని రకాల రాయితీలు కొనసాగుతాయని విద్యుత్, రవాణాశాఖ మంత్రి ఎస్ శివశంకర్ స్పష్టం చేశారు. ఏటా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జూలైలో విద్యుత్ చార్జీలను వడ్డిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2023లో గృహాలకు పెంపు నుంచి మినహాయించారు. 2024 లోక్ సభ ఎన్నికల అనంతరం జూలైలో 4.83 శాతం చార్జీలను వడ్డించారు. ఈ పరిస్థితులలో తాజాగా 3.16 శాతం చార్జీలను వడ్డించే విధంగా విద్యుత్ బోర్డు కసరత్తులు చేసి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న డీఎంకే ప్రభుత్వానికి ఈ పెంపు కసరత్తులు ఇరకాటంలో పడేశాయి. ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యారంటూ ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. దీంతో విద్యుత్ మంత్రి శివశంకర్ స్పందించారు.
ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు
మంత్రి శివశంకర్ పేర్కొంటూ, గత కొన్ని రోజులుగా విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ వస్తున్న సమాచారాలను ఖండించారు. ఇవన్నీ అనధికారికం అని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. తమిళనాడు విద్యుత్ నియంత్రణ కమిషన్ ద్వారా కూడా ఎలాంటి సిఫారసులు, కసరత్తులు జరగ లేదని వివరించారు. అయితే, విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ ఒక ఉత్తర్వులు సిద్ధం చేసేటప్పుడు గానీ, అమలు చేసేటప్పుడు గానీ, గృహ విద్యుత్ వినియోగ దారులకు ఎలాంటి పెంపు అన్నది ఉండదన్నారు. గృహాలకు ఎలాంటి పెంపు అన్నది ఉండదని, ఉచిత, ఇతర రాయితీలన్నీ కొనసాగుతాయని స్పష్టం చేశారు.


