నేడు వైకుంఠ ఏకాదశి
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని వైష్ణవ క్షేత్రాల్లో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం పలు ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆధ్యాత్మికతకు నెలవుగా ఉన్న తమిళనాట ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది. ఇందులో తిరుచ్చి శ్రీరంగంలో కొలువు దీరిన శ్రీరంగనాథ స్వామి ఆలయం వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇది భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. గత వారం నుంచి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేకాది పూజలు, అలంకరణలు, వాహన సేవలు జరుగుతూ వస్తున్నాయి. సోమవారం పగల్ పత్తు ఉత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో శ్రీరంగం పులకించింది. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయంలో ఉత్తర ద్వారం తెరచుకోనున్నది. భక్తులకు ఈ ద్వారం నుంచి ప్రవేశం కల్పించనున్నారు. అలాగే స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక, రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలు అన్ని వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధమయ్యాయి. హిందూ ధర్మాదాయ శాఖ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు. చైన్నెలోని ట్రిప్లికేన్ పార్థసారధి ఆలయంలోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. పరిసరాలలో వెయ్యి మందితో భద్రత ఏర్పాట్లు చైన్నె కమిషనర్ అరున్ ఆదేశాలతో చేశారు. ఆరుగురు డిప్యూటీ కమిషనర్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ పరిసరాలను సీసీ కెమెరాల నిఘా వలయంలోకి తీసుకొచ్చారు.ట్రాఫిక్ సమస్య ఎదురు కాకుండా ఆ పరిసర మార్గాలలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం సాగే వేడుకల అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. నాలుగున్నర గంటల సమయంలో స్వర్గ ద్వార ప్రవేశ కార్యక్రమం మొదలు పెట్టనున్నారు.
శ్రీవారి ఆలయంలో..
టీ నగర్ వెంకటనారాయణ రోడ్డులోని టీటీడీ సమాచార కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామివారి సన్నిధిలోనూ ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం నిమిత్తం భక్తులను వేకువ జామున 3 గంటల నుంచి 11 గంటల వరకు, ఆ తర్వాత 11.45 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5.30 వరకు, 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించనున్నారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్ అమ్మవారి ఆలయం, మదురై తల్లాకులంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి తదితర వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి.


