అభిమానుల తోపులాటతో.. కింద పడిన విజయ్
తమిళ సినిమా: అభిమానుల తోపులాటతో తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ కిందపడ్డారు. ఈ ఘటన చైన్నె ఎయిర్‌పోర్టులో జరిగింది. మలేసియాలో శనివారం జరిగిన ‘జననాయకన్’ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముగించుకుని చైన్నె విమానాశ్రయానికి వచ్చిన విజయ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో విజయ్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను సురక్షితంగా కారులో ఎక్కించారు. విజయ్ కారు కొంచెం దూరం వెళ్లిన తర్వాత.. పక్కగా దూసుకొచ్చిన మరో కారు ఢీ కొట్టింది. దీంతో విజయ్ కారు ఇండికేటర్ విరిగిపోయింది. అలాగే నటి మమితా బైజూ చైన్నె ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా ఆమెను అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో మమితా పరుగులు తీస్తూ బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు. ఇలా అభిమానుల దురాభిమానంతో తారలకు కలుగుతున్న ఇబ్బందులపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


