సీబీఐ ఎదుట టీవీకే ముఖ్య నేతలు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం(టీవీకే) ముఖ్యనేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున ,నిర్మల్‌కుమార్‌తో పాటూ మరొకరు ఢిల్లీ వెళ్లారు. ఇక్కడి సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. వీరు ఢిల్లీలోనే తిష్ట వేసి ఉన్న సమచారం ప్రాధాన్యతకు దారి తీసింది. టీవకే అధ్యక్షుడు విజయ్ సెప్టెంబరు 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన ప్రచారంలో చోటు చేసుకున్న విషాద ఘటనను సీబీఐ విచారిస్తోంది. ఈ ఘటనలో 41 మంది మరణించగా 160 మంది గాయపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారుల బృందం విచాణను వేగవంతం చేసింది. ఇప్పటికే చైన్నె పనయూరులోని టీవీకే కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారణ నిర్వహించారు.
టీవీకే ముఖ్యనేతలైన భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున, నిర్మల్‌కుమార్ తదితరులను విచారించారు. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తూ వస్తోంది. పలు కోణాలలో ఈ విచారణ ఇప్పటి వరకు కరూర్ వేదికగా సీబీఐ పూర్తి చేసింది. తాజాగా సమగ్ర వివరాలతో ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ పరిస్థితులలో టీవీకే ముఖ్య నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున, నిర్మల్‌కుమార్‌తో పాటుగా మరొకరు ఢిల్లీ వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడి సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. కరూర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే తాము అందించిన సమాచారాలకు సంబంధించిన సమగ్ర ఆధారాలను సీబీఐ ఉన్నతాధికారుల ఎదుట సమర్పించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ముఖ్య నేతలు ఢిల్లీలోనే తిష్ట వేసి ఉన్నట్టు సమాచారం. ఇది కాస్త రాజకీయ ప్రాధాన్యతకు దారి తీసింది. తమ వైపుగా టీవీకేను తిప్పుకునేందుకు సీబీఐ ద్వారా బీజేపీ ఏదేని వ్యూహాలకు రచన చేసిందా? అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ దిశగా ఢిల్లీలో వీరు తిష్ట వేసి ఉన్నట్టుగా మరో చర్చ తెర మీదకు వచ్చింది.


