ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యల దుమారం
సాక్షి, చైన్నె : ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సన్నిహితుడు, ఆ పార్టీ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి మరోమారు డీఎంకేకు ఆగ్రహాన్ని తెప్పించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగేనా..? అన్న చర్చకు మరోమారు తెరదీశారు. తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోమవారం హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై డీఎంకే సీరియస్ కాగా, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అప్రమత్తమయ్యారు. ప్రవీణ్ చక్రవర్తిపై ఎదురు దాడికి దిగారు. వివరాలు.. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ స్థానిక నాయకులు షాక్ ఇచ్చే విధంగా ఏఐసీసీ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. టీవీకే అధినేత విజయ్‌తో భేటీ గురించి ఈ వ్యాఖ్యలు ఉండటం రాజకీయంగా వేడెక్కింది. ఓ వైపు డీఎంకేతో మరో వైపు విజయ్‌తో కాంగ్రెస్ టచ్‌లో ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఇది కాస్త డీఎంకేలో సైతం ఆగ్రహాన్ని రేపినట్లయ్యింది. ఏఐసీసీ పెద్దల వద్ద డీఎంకే వర్గాలు తమ ఆగ్రహన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ప్రవీణ్ చక్రవర్తి వివరణ ఆ భేటీ గురించి వివరణ ఇచ్చుకున్నారు. ఈ భేటి ఇడ్లీ, వడా, దోసె తినేందుకే అని చమత్కరించారు. అదే సమయంలో డీఎంకేతో కాంగ్రెస్ సీట్ల పందేరం చర్చలు మొదలెట్టింది. ఇది కాస్త పలు ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తున్నాయి. అధికారంలో వాటా అన్న నినాదాన్ని కాంగ్రెస్ అందుకోవడంతో డీఎంకే గుర్రు మంటున్నది. అధికారంలో వాటా అన్నది ఎవ్వరి ఇచ్చే పరిస్థితి లేదన్నట్టుగా డీఎంకే నుంచి ఏఐసీసీకే కాదు, ఇతర కూటమి పార్టీలకే సైతం సంకేతాలు వెళ్లినట్టు సమాచారం. అదే సమయంలో సోమవారం మరో మారు ఏఐసీసీ నాయకుడు ప్రవీన్‌చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపే పరిస్థితికి తీసుకొచ్చింది.
వ్యాఖ్యల తూటా... ఎదురు దాడి
తమిళనాడు ప్రగతి గురించి డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సోమవారం ప్రవీన్ చక్రవర్తి ఎక్స్ పేజీలో స్పందించడం చర్చకు దారి తీసింది. డీఎంకేతోకాంగ్రెస్ కూటమి కొనసాగేనా..? అన్న పరిస్థితికి ఈ ట్వీట్ దారి తీసింది. తమిళనాడు అప్పుల ఊబిలో ఉందని, ఇది ప్రమాదకరంగా వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే హయంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ, డీఎంకే వచ్చినానంతరం ఆర్థికంగా పుంజుకున్నట్టు పేర్కొన్నారు.అయితే, ఇందు కోసం చేసిన అప్పులు ప్రమాదకరంగా ఉందన్నారు. పంజాబ్, హార్యాన వంటి రాష్ట్రాలు చెల్లించే వడ్డీ కన్నా, తమిళనాడు తీసుకున్న అప్పుకు వడ్డీని చెల్లిస్తున్నదన్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్ అప్పుల ఊబిలో ఉండేదని,తాజాగా అప్పుల భారం తగ్గిందన్నారు. అయితే,గతంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నట్టుగా తాజాగా తమిళనాడు అప్పుల ఊబిలో చిక్కుకుని ఉందని ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యానించడం డీఎంకేలో ఆగ్రహాన్ని రేపింది. మంత్రి టీఆర్‌బీ రాజా స్పందిస్తూ ఎవరెన్ని కుయుక్తులకు పాల్పడినా వాటి గురించి పట్టించుకోదలచుకోలేదని, అయితే, ఇలాంటి వ్యాఖ్యలు వారికే నష్టాన్ని చేకూర్చుతాయని పేర్కొన్నారు. ఇక, డీఎంకే నేతలు స్పందించే పనిలో పడటంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. కాంగ్రెస్ ఎంపీలు జ్యోతి మణి, శశికాంత్‌సెంథిల్‌లు మీడియా ముందుకు వచ్చారు. ఉత్తర ప్రదేశ్‌తో తమిళనాడును పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. తమిళనాడు విద్య, ఆరోగ్య, సామాజిక న్యాయంలో ముందంలో ఉందన్నారు. అప్పులను మాత్రమే చూడవద్దు అని, అభివృద్ధి కూడా చూడాలంటూ హితవు పలికారు. ఇక, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై అయితే, ప్రవీణ్‌చక్రవర్తి తీరుపై తీవ్రంగానే స్పందించారు. ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా ఏం జరుగుతున్నదో ఓ మారు ఆయన గుర్తెరగాలని, ఇది కాంగ్రెస్ గళం, స్వరం మాత్రం కాదని, ఆర్‌ఎస్‌ఎస్ గళం వలే ఉన్నట్టు ధ్వజమెత్తారు. తమిళనాడు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఈ సమయంలో ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన ఏమైనా తమిళనాడు కాంగ్రెస్‌కు సూపర్ అధ్యక్షుడు అనుకుంటున్నారా? అని మండి పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం రాజ్యమేళుతోందన్న విషయాన్ని గుర్తెరగాలని, చిల్లర రాజకీయలు కట్టి పెట్టాలంటూ...ప్రవీణ్ చక్రవర్తి తీరుపై ఏఐఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గేకు ఫిర్యాదు చేయనున్నామన్నారు.
ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యల దుమారం


