మాయలేడి.. మట్టి గుర్రం! | - | Sakshi
Sakshi News home page

మాయలేడి.. మట్టి గుర్రం!

May 12 2023 12:33 PM | Updated on May 12 2023 12:34 PM

మాట్లాడుతున్న  పళణి స్వామి  - Sakshi

మాట్లాడుతున్న పళణి స్వామి

సాక్షి, చైన్నె: మాయలేడి.. మట్టి గుర్రం ఒక చోట చేరాయని పన్నీరు, టీటీవీ దినకరన్‌ల భేటీ కావడంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తనకు బద్ధశత్రువుగా ఉన్న టీటీవీ దినకరన్‌ను తాజాగా పన్నీరు సెల్వం మిత్రుడిగా అక్కున చేసుకున్నారు. పళణి స్వామి చేతిలో నుంచి అన్నాడీఎంకేను దక్కించుకునేందుకు పన్నీరు, టీటీవీ సమష్టి వ్యూహాలకు నిర్ణయించారు. అలాగే దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళను కూడా కలుపుకు వెళ్లే దిశగా ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ పరిణామాలపై గురువారం మీడియా సంధించిన ప్రశ్నలకు పళణి స్వామి తన దైన శైలిలో స్పందించారు. ద్రోహి.. మరో ద్రోహి చేతులు కలిపారని, ఇద్దరు ద్రోహులే కాబట్టి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో ఒకరు మాయ లేడి అని, మరొకరుడు మట్టి గుర్రం అని ఎద్దేవా చేశారు. అలాగే ఇందులో దినకరన్‌ గుడారం పూర్తిగా ఖాళీ అవుతోందని, ఇందులోకి ఓ ఒంటె (పన్నీరు) ప్రవేశించినట్లుగా ఈ కలయిక ఉందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా అన్నాడీఎంకేను నీడను కూడా తాకలేరని స్పష్టం చేశారు.

మాయలేడి, మట్టి గుర్రం గురించి కాకుండా, పార్టీ బలోపేతం గురించి తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ ఇద్దరు తన దృష్టిలో ప్రస్తుతం జీరోలు అని ఎద్దేవా చేశారు. పన్నీరు మద్దతు నేత బన్రూటి రామచంద్రన్‌ గురించి వ్యాఖ్యలు చేస్తూ, ఆయన మండల కార్యదర్శి పదవికి కూడా అర్హుడు కాడని పేర్కొన్నారు. దివంగత అమ్మ జయలలితను వ్యతిరేకించి పీఎంకేలోకి, ఆ తర్వాత డీఎండీకేలోకి వెళ్లారని గుర్తు చేశారు. ఆయన వెళ్లిన చోటల్లా ఆ పార్టీలకు మిగిలింది కష్టాలేనని పేర్కొన్నారు. ఆయన ఓ చోట నిలకడగా ఉండరని, ఇప్పుడు సున్నా...ప్లస్‌ సున్నాతో చేతులు కలిపి మరో సున్న కాబోతున్నాడని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement