
నయనార్ నాగేంద్రన్
సాక్షి, చైన్నె: తాను మళ్లీ అన్నాడీఎంకేలోకి వెళ్లబోనని బీజేపీ శాసన సభాపక్ష నేత నయనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా అన్నాడీఎంకేలో ఒకప్పుడు కీలక నేతగా నయనార్ నాగేంద్రన్ ఉండే వారు. దివంగత నేత జయలలితను ఢీకొట్టి మరీ అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకేలోని నాయకులలో నయనార్ సీనియర్‌గా చెప్పవచ్చు. అప్పట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నయనార్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పరిధిలోని ఓ విభాగానికి పళణి స్వామి నామినేటెడ్ పదవిలో చైర్మన్‌గా ఉండేవారు.
అలాంటి నేత అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. ఆ పార్టీ శాసన సభాపక్ష నేతగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడీఎంకేలో ఉన్నప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చే సమయంలో తీవ్ర వేదన చెందానని, ఆవేదన వ్యక్తం చేశానని పేర్కొన్నారు. తనకు పళణి స్వామి సన్నిహితుడు అని గుర్తు చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో తన పరిధిలోని ఓ విభాగానికి ఆయన చైర్మన్‌గా ఉండేవారు అని, అయితే, ఆయన ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తనను మళ్లీ మాతృసంస్థలోకి వచ్చేయాలని పళణి స్వామితో పాటుగా అన్నాడీఎంకే నేత జయకుమార్ ఆహ్వానించారని తెలిపారు. తాను అన్నాడీఎంకేలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఏపార్టీలో ఉన్నా, తనను ఆదరించే వాళ్లు, అభిమానం చూపించే వాళ్లు వెన్నంటి ఉన్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తనకు అందరితోనూ మంచి స్నేహం ఉందని, అందువల్లే మళ్లీ అన్నాడీఎంకేలోకి వెళ్లను అని స్పష్టం చేశారు. తాను ఎవరినీ సాయం అడగను అని, తన చుట్టూ ఉన్న వారిని ఆదరించడం, ప్రేమ చూపించడం, వారిని కలుపుకు వెళ్లడం తన పయనంగా వివరించారు.