
ప్రేమ విఫలమైందని ఓ కళాశాల విద్యార్థిని
తిరువొత్తియూరు: క్రిష్ణగిరి జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ కళాశాల విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి జిల్లా నాయకనూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ (48) తాపీమేస్త్రి. ఇతని భార్య తమిళరసి పంచాయతీ మాజీ సర్పంచ్. వీరి చిన్న కుమార్తె దమయంతి (19) క్రిష్ణగిరిలో ఉన్న ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దమయంతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి సింగారపేట పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్దకు చేరిన కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. విచారణలో విద్యార్థిని అదే గ్రామానికి చెందిన శ్రీనాథ్ (25) అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు, అతను ఆమెను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించాడని, అతనిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన శ్రీనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.