ఖర్చు రెండింతలయ్యింది
ఏమీ కొనలేని పరిస్థితి
తిరుమలగిరి (తుంగతుర్తి) : కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. ఒక్కో రకం కూరగాయల ధర 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరగడంతో మార్కెట్‌కు వెళ్లిన వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదేమంటే మార్కెట్‌కు కూరగాయలు రావడం లేదని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.
స్థానికంగా ఉత్పత్తి తగ్గడమే కారణం
నెల రోజుల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ఉత్పత్తి అధికంగా ఉండేది. దీంతో వారసంతలు, దుకాణాల్లో కూరగాయలను వినియోగదారులు విరివిగా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల స్థానికంగా కూరగాయల సాగు తగ్గి దిగుబడి పడిపోయింది. ఫలితంగా వ్యాపారులు హైదరాబాద్, కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లి తీసుక రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దళారులు ధరలు పెంచేశారు. వారి నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు సైతం ధరలను మరింత పెంచడంతో వినియోగదారులకు పెనుభారంగా మారింది. కూరగాయలు కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వచ్చిన మహిళలు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు.
రైతుకు దక్కని గిట్టుబాటు!
కిలో కాకరకాయ ధర గతంలో రూ.30 నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం కిలో రూ.60 పలుకుతోంది. చాలా రోజుల పాటు రూ.25 ధర పలికిన టమాట ప్రస్తుతం రూ.40కి చేరింది. సొరకాయ, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. మార్కెట్లకు కనీసం రూ.500 తీసుకొని వెళ్తేనే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేది కష్టమని మహిళలు వాపోతున్నారు. దళారులు తమకు తక్కువ ధర చెల్లించి కూరగాయలు కొంటున్నారని, తమకు ఏమాత్రం గిట్టుబాటు అందక నష్టపోతున్నామని కూరగాయలు పండించే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న రేట్లు
కిలో రూ.80కి చేరిన మిర్చి,
బీర, క్యారెట్
కాకర, చిక్కుడు రూ.60పైమాటే..
బెంబేలెత్తుతున్న పేద కుటుంబాలు
మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాము. నెల క్రితం రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెడితే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.400 ఖర్చు చేసినా వారానికి సరిపడా రాని పరిస్థితి. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఖర్చు రెండింతలయ్యింది. – రమ, తిరుమలగిరి
ప్రతి కూరగాయ ధర కిలో రూ.50కి పైగానే పలుకుతుంది. సామాన్యులు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల పంటల సాగు పెంచేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు వంద శాతం సబ్సిడీలు ఇచ్చి పంటల సాగు పెంచితేనే ధరలు తగ్గుముఖం పడతాయి.
– శ్రీనివాస్, తిరుమలగిరి


