సూర్యాపేటటౌన్ : జిల్లా పరిధిలో మొత్తం ఐదు సెంటర్లలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల, చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని మైనారిటీ గురుకులంతోపాటు సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట ప్రభుత్వ మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష నిర్వహించారు. ఆయా సెంటర్లలో మొత్తం 908 మంది విద్యార్థులకు 763 మంది హాజరు కాగా 145 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11.30గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30గంటల వరకే అనుమతించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు విద్యార్థులను చెకింగ్ చేసి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, బాలికలకు చెవుల దిద్దులు, పట్టీలు, దండలు ఏమి ఉన్నా తీయించారు.
బందోబస్తును పరిశీలించిన ఎస్పీ
సూర్యాపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. బందోబస్తు వివరాలు, విద్యార్థుల హాజరు వివరాలను డీఎస్పీ ప్రసన్న కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ముగిసిన ‘నీట్’
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో 5 సెంటర్లలో 908 మంది విద్యార్థులకు 763 మంది హాజరు కాగా 145 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష నేపథ్యంలో అన్ని సెంటర్ల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఐదు సెంటర్లలో ప్రశాంతంగా పరీక్ష
మొత్తం 763 మంది
విద్యార్థులు హాజరు
సూర్యాపేటలో పరీక్ష కేంద్రం
తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ


