రైతులు మురవంగా..! | - | Sakshi
Sakshi News home page

రైతులు మురవంగా..!

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సాగుకు దన్నుగా జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున మొదలై ఉదయం 10 గంటల వరకు పలు మండలాల్లో వర్షం పడింది. ఈ వర్షంతో సాగు పనులు చేసుకోవచ్చని రైతన్నలు మురిసిపోతున్నారు. అత్యధికంగా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పెన్‌పహాడ్‌, కోదాడ, నేరేడుచర్ల, పాలకవీడు, హుజూర్‌నగర్‌, మేళ్లచెరువు మండలాల్లో వర్షం పడలేదు. మొత్తంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా 4.2 మిల్లీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా 3.7 మిల్లీమీటర్ల వర్షం పడింది.

చిరుజల్లుల నుంచి మోస్తరు దాకా..

జిల్లాకు వాతావరణ శాఖ నాలుగురోజుల పాటు భారీ వర్షసూచన చేసింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం పడింది. సూర్యాపేట జిల్లాకేంద్రంతోపాటు నాగారం, తిరుమలగిరి, సూర్యాపేట, మునగాల, నడిగూడెం, అనంతగిరి, గరిడేపల్లి, మఠంపల్లి, చింతలపాలెం మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఇక తుంగతుర్తి 4.7 మిల్లీమీటర్లు, మద్దిరాల 2.1 మి.మీ, జాజిరెడ్డిగూడెం, మోతె 22.8, చివ్వెంల 1.5, చిలుకూరు 3.8 మిల్లీమీటర్ల చొప్పున మోస్తరు వర్షం పడింది. సాయంత్రం కూడా నూతనకల్‌, మద్దిరాల తదితర మండలాల్లో మోస్తరు జల్లులు కురిశాయి.

సాగుకు దన్నుగా..

జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు దన్నుగా మారాయి. ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు పారలేదు. చెరువులు, కుంటల్లోకి చుక్కనీరు చేరలేదు. కానీ మెట్టపంటలకు అనుకూలమైన జల్లులు పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు చేరితే ఈ వానాకాలం సీజన్‌లో బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగి పంటల సాగుకు ఇబ్బందులు ఉండవని రైతులు భావిస్తున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమై ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లాలోని 9 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నాగారం, మద్దిరాల, తిరుమలగిరిలో ఇంకా వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి.

జిల్లాలోని పలు మండలాల్లో

కురిసిన వర్షం

అత్యధికంగా ఆత్మకూర్‌(ఎస్‌)లో

23.2 మి.మీ. వర్షపాతం

మరో నాలుగు రోజుల పాటు వర్షసూచన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement