విస్తరిస్తున్న కాలనీలు.. | - | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న కాలనీలు..

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

మౌలిక వసతులు కల్పిస్తాం

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట మున్సిపాలిటీ వేగంగా విస్తరిస్తోంది. జాతీయ రహదారిపై ఉండడంతో వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో జనాభా కూడా పెరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులలో కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి. ఆయా కాలనీల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక పోవడంతో ఖాళీ ప్లాట్లలో, ఇళ్ల మధ్యే మురుగు పేరుకు పోతున్నది.

సీసీ రోడ్లు లేక..

మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ఇప్పటికీ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కొన్నిచోట్ల మట్టి రోడ్లు, మరికొన్ని ప్రాంతాల్లో గుంతలమయంగా మారిన రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షా కాలంలో మట్టిరోడ్లు బురద మయంగా మారడంతో రాకపోకలు కూడా కష్టంగా మారుతోందని ఆయా కాలనీల ప్రజలు వాపోతున్నానరు. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌కే గార్డెన్‌, ఇందిరమ్మ కాలనీ ఫేస్‌–1, ఫేస్‌–2, ఫేస్‌–3, తిరుమలనగర్‌, అంబేద్కర్‌నగర్‌, వెంకటేశ్వరకాలనీ, వినాయనగర్‌ కాలనీ, జమ్మిగడ్డ, స్నేహనగర్‌, సుందరయ్యనగర్‌ కాలనీలతో పాటు మున్సిపాలిటీలో విలీనమైన దురాజ్‌పల్లి, కుడకుడ, దాసాయిగూడెం, పిల్లలముర్రి గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా కాలనీలలో సరైన డ్రెయినేజీలు లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరంతా రోడ్లపై పారుతోంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లలో చేరి మురుగు నీటి కుంటలా మారుతోంది. ఇందులో పందులు స్వైరవిహారం చేస్తుండటంతో దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దోమల బెడదతో రోగాల పాలవుతున్నారు.

వర్షం వస్తే మునుగుడే..

చాలా కాలనీలలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక పోవడంతో వర్షాకాలంలో కాలనీల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. భారీ వర్షం కురిస్తే ఆ నీరంతా కాలనీల్లో నిలిచి ఇళ్లను ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఎస్వీ డిగ్రీ కళాశాల వెనుకభాగం, ఆర్‌కే గార్డెన్‌, సుందరయ్యనగర్‌, స్నేహనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. గతంలోనూ కాలనీలు వరద నీటిలో మునిగిన సందర్భాలు ఉన్నాయి.

తాగునీటికీ కటకటే..

కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో తాగునీటి సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. దాంతో ప్రజలు నీటిని కొనుగోలు చేసి మరీ తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఇంట్లో బోరు ఉన్న వారు వాటిని వినియోగించుకుంటుండగా.. లేని వారు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు సైతం పనిచేయడం లేదని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తున్నదని చెబుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కొత్త కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, ప్రాధాన్యత ఆధారంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. వర్షపు నీటి పారుదలకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కొత్త కాలనీలలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కరువు

సూర్యాపేట మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో సమస్యలనేకం

ఇళ్ల మధ్యే, చెత్త, మురుగు

మౌలిక వసతులు కల్పించాలని

స్థానికుల వినతి

మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో నిధులు కేటాయించి వసతులు కల్పిస్తాం. వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపడతాం. పట్టణంలోని వార్డులలో నెలకొన్న సమస్యలపై కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తాం. చైర్మన్‌, వార్డు సభ్యుల చొరవతో ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేపడతాము.

– సీహెచ్‌.హన్మంతరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
 
Advertisement
Advertisement