
కోటపహాడ్ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
ఆత్మకూర్(ఎస్) : మండలంలోని కోటపహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.విజయ్ కుమార్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కార్యదర్శి విధులకు సక్రమంగా రాకుండా గ్రామంలో పారిశుద్ధ్యం పనులు పట్టించుకోకపోవడంతో వీధులు, మురికి కాలువల్లో చెత్తపేరుకుపోయి దుర్వాసన వస్తోందని మూడు రోజులు క్రితం గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడం, నిరసన గురించి పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ విచారణ చేపట్టి కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారని ఎంపీడీఓ తెలిపారు.
నీట్ పీజీ పరీక్షకు
ఏర్పాట్లు పూర్తి
కోదాడరూరల్ : నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని సన కళాశాలలో ఆదివారం జరగనున్న నీట్ పీజీ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. సన కళాశాలలో 50 మంది, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో 180 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అభ్యర్థులను 7 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. పరీక్ష హాల్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని, సీసీ కెమోరాలు, జామర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్‌అలీ, కళాశాల సిబ్బంది ఉన్నారు.
పీహెచ్‌సీల్లో కాన్పుల
సంఖ్య పెరగాలి
అర్వపల్లి: పీహెచ్‌సీల్లో సాధారణ కాన్పుల సంఖ్య పెరిగేలి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు జ్వర పీడితులను గుర్తించి వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్‌నాయక్, సీహెచ్‌ఓ ఎం.బిచ్చునాయక్, నర్సింగ్ ఆఫీసర్ మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎనిమిది గేట్ల ద్వారా
పులిచింతల నీటి విడుదల
మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు 2,08,455 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో అధికారులు 8 గేట్లను మూడు మీటర్ల మేరకు పైకెత్తి 2,05,279 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్‌కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్ట అధికారులు తెలిపారు.

కోటపహాడ్ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్