
ముఖ హాజరు
తొలిరోజు 2,689 మంది
ఉపాధ్యాయులకు
‘ఫేస్ రికగ్నిషన్’ అమలు
ఫ సాంకేతిక సమస్యలతో
ఆలస్యంగా రిజిస్ట్రేషన్
ఫ జిల్లాలో 881 స్కూళ్లు..
4,542 మంది టీచర్లు
సూర్యాపేటటౌన్ : విధులు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లకు ఇకనుంచి చెక్ పడనుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానం అమలు చేస్తున్నారు. ఇందుకు ఉపాధ్యాయులే నేరుగా తమ సెల్ ఫోన్లలోనే ఆన్‌లైన్ విధానంలో హాజరు నమోదు చేసుకునేలా టీజీఎఫ్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ నూతన విధానాన్ని శుక్రవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. అయితే మొదటి రోజు 2,689 మంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లు జరగలేదు. శనివారం అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తిచేయనున్నారు.
విద్యార్థులకు మాదిరిగానే..
గతేడాది నుంచి పాఠశాలల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించి విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు టీచర్లకు హాజరు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేసేలా ఏర్పాట్లు చేశారు.
యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..
జిల్లాలోని 881 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 4,542 మంది పనిచేస్తున్నారు. కొత్త విధానం అమలులో భాగంగా సంబంధిత ఉద్యోగి స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. యాప్ ఇన్‌స్టాలేషన్ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశాల ఆవరణ లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌లను టెక్నీషియన్ అప్‌లోడ్ చేస్తారు. ఒక్కసారి లాగిన్ అయిన తరువాత యాప్ నిరంతరంగా వినియోగించవచ్చు. ఇక ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి పాఠశాలకు వచ్చిన తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి క్లాక్ ఇన్ అనే ఆప్షన్ నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్‌లైన్‌లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. పాఠశాలలో పని సమయం, ముగిసిన తర్వాత క్లాక్ ఔట్ అనే ఆప్షన్‌పై టచ్ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయాన్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారి ఆన్‌లైన్‌లో చేరుతుంది.
విద్యార్థులకు మెరుగైన బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు కొందరు సమయానికి రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలులోకి తెచ్చింది. దీతో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా మెరుగైన బోధన అందుతుంది. మిగిలిన ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ శనివారం పూర్తవుతుంది.
– అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి
ఉత్తమ బోధనే లక్ష్యంగా..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. విద్యార్థులకు ఉత్తమ బోధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. చాలామంది పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్కూళ్లకు వేళకు చేరుకోవడం లేదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు విద్యాశాక ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ముఖ హాజరు