రైతు భరోసా కేంద్రాల నిర్వీర్యం.. ప్రైవేటు డీలర్లకు పట్టం.. ఫెర్టిలైజర్ కంపెనీలకు దాసోహం.. వెరసి ప్రభుత్వం అన్నదాతల వెన్ను విరుస్తోంది. క్యూ కట్టకుండా, నిరీక్షణ లేకుండా ఎరువు ఇచ్చే ప్రసక్తే లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తన దారి తనదేనని చర్యల ద్వారా నిరూపించుకుంటోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనూ వింత పరిస్థితులే ఎదురవుతున్నాయి.
కోటబొమ్మాళిలో ఏకగ్రీవ తీర్మానం
వ్యవసాయ శాఖ మంత్రి సొంత మండలం కోటబొమ్మాళిలో హోల్‌సేల్ అండ్ రిటైల్ డీలర్లు ఇటీవల ఒక సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లింక్ ప్రొడక్ట్‌లు ఇస్తే ఏ కంపెనీ వద్ద కూడా ఎరువులు కొనుగోలు చేయకూడదని షరతు పెట్టుకున్నారు. జిల్లాలోని ఫెర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఈ విషయాన్ని వెల్లడించటంతో మిగిలిన డీలర్లు ఆలోచనలో పడ్డారు. సీజన్‌కు ముందే కలెక్టర్ సూచనలతో జేసీ ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ కంపెనీల ప్రతినిధులు, హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లకు లింక్‌లు తగ్గించాలని చెప్పినా వారి తీరు మారలేదు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లాలో ఖరీఫ్ సాగు మొదలైనప్పటికీ ఎరువుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. గత ఏడాది అనుభవాలు దృష్ట్యా ఈసారి అప్పోసప్పో చేసి ముందే ఎరువు తెచ్చుకుందామని బయల్దేరిన రైతులకు ‘యాప్ ద్వారా ఎరువులు అమ్మబడును’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి తప్ప ఏ షాప్‌లోనూ ఎరువు దొరకటం లేదు. ఎక్కువ చోట్ల ప్రైవేట్ దుకాణాల్లో నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఫెర్టిలైజర్ కంపెనీలు ఈ ఏడాది కూడా లింక్ ప్రొడక్టులు డీలర్లకు అంటగట్టడంలో ఎక్కడా తగ్గటంలేదు. ఇక నానో సంగతి చెప్పనక్కర్లేదు. జిల్లాలో 370 మంది ప్రైవేట్ ఫెర్టిలైజర్ రిటైలర్స్ ఉంటే అందులో సగానికి పైగా డీలర్లు ఎరువులు స్టాక్ తీసుకురాలేదని తెలుస్తోంది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో ఎరువుల కోసం రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
వాస్తవంగా సచివాలయంలో ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే మార్క్‌ఫెడ్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి సమాంతరంగా దగ్గరలో ఉన్న రిటైలర్లకు సరఫరా చేయాలి. దానిపై పర్యవేక్షణ చేయాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో అలా జరగడం లేదు. అధికారం ఉన్నోడిదే రాజ్యమైపోతోంది.
ఓటీపీలతో అవస్థలు
‘ఏపీఎయిమ్స్2.0’ యాప్‌లో ఓటీపీలతో రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఎక్కువ మంది హక్కుదారులు తమ భూములను చిన్న, సన్నకారు రైతులకు అప్పగిస్తుంటారు. ఇప్పుడు వారు ఓటీపీ చెప్పాల్సి రావటంతో కొందరు తొలుత కుదరని చెప్పినా తర్వాత తప్పదని తెలిసి చెప్పాల్సి వచ్చినా రెండుసార్లు చెప్పటంతో కొంత ఇబ్బంది ఫీలవుతున్నారు. దీనికి ప్రతీ డీలరు ఎల్–1 డివైస్ తీసుకోవాలని వ్యవసాయశాఖ తాజాగా సూచించినప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా అందుబాటులో లేని వారి అథెంటికేషన్ ఎలా అనేది చెప్పాల్సి ఉంది. ఇన్ని సమస్యలు ఎందుకు అనుకున్నారో ఏమో గానీ జిల్లాలో ప్రైవేటు డీలర్లు చాలావరకు ఎరువుల నిల్వలు ఉంచుకోవటం లేదు. అందుకే యాప్‌లో ఉన్న యూరి యా షాపులో లేదయా అంటున్నారు రైతులు.
లింక్‌లపై పర్యవేక్షణ ఏదీ..?
వాస్తవానికి ప్రస్తుతం జిల్లా వ్యవసాయశాఖ అధికారికి లింక్ ప్రొడక్టులపై పూర్తి అవగాహన వుంది. అందుకే ఒకటికి రెండుసార్లు ఈ జిల్లాలో నడుస్తున్న ఫెర్టిలైజర్ సిండికేట్‌తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సున్నితంగా హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఇప్పటికే మార్కెట్‌లోకి వెళ్లిపోయిన లింక్‌ప్రొడక్ట్‌ల విషయంపై ప్రైవేటు డీలర్లు నష్టపోతారనే సాఫ్ట్ కార్నర్ జిల్లా వ్యవసాయశాఖలో కనిపిస్తోంది. దీంతో రైతులకు భారం తప్పడం లేదు.
వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో వింత అనుభవం
సగానికి పైగా డీలర్ల వద్ద నోస్టాక్ బోర్డులు
స్టాక్ ఉంటే ‘లింకు’ల బెడద
తూతూ మంత్రంగా వ్యవసాయశాఖ
పర్యవేక్షణ


