కొత్తూరు: అధికారంలోకి వస్తే జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీపై మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో గోవిందరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గొట్టిపల్లిలో గిరిజనులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయడంతో పాటు.. గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా సమస్యలు పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు, సంవత్సరాలు నుంచి సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. గిరిజన భూములు ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గిరిజనులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సిర్ల ప్రసాద్, అప్పన్న, సుంకయ్య, గణపతి, రామారావు తదితరులు పాల్గొన్నారు.


