బగ్గువారి బాగోతాలు | - | Sakshi
Sakshi News home page

బగ్గువారి బాగోతాలు

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

● హస్తిన సాక్షిగా

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

రసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఏకంగా జాతీయ స్థాయికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న, అవినీతి అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దర్జాగా దోపిడీ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. తాజాగా ఇసుక, మద్యం మాఫియాతో పాటు ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు వెళ్లింది. ఎమ్మెల్యే వ్యవహారాలను ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్తలపై యాంత్రిక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాది మొర పెట్టుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తమకు సంబంధించి డైరీలో కూడా రిజిస్టర్‌ చేసింది.

బరి తెగింపు.. అంతా ఇంతా కాదు..

నరసన్నపేట నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. బహిరంగంగానే ఇసుక దోపిడీ జరుగుతోంది. రూ.వందల కోట్లను అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. పట్టపగలే వంశధార నదిని యంత్రాలతో తవ్వేసి, నచ్చిన ధరకు విక్రయించి విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అడ్డొచ్చిన వాళ్లపై దాడులకు కూడా తెగబడుతున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు బరితెగించి, దర్జాగా దోచుకుంటున్నారు. చెప్పాలంటే ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అధికారులు సైతం అక్రమ తవ్వకాలపై చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. దీని ఫలితంగా నదిలో మంచినీటి వనరులకు హాని కల్గిస్తున్నారు. లోతుగా తవ్వకాలు జరిపి నీటి లభ్యతకు దెబ్బకొడుతున్నారు.

అందినంతా దోచుకో..

లిక్కర్‌ మాఫియా కూడా ఇక్కడ నడుస్తోంది. మద్యం దుకాణాలను ఒక వర్గం ఎక్కువగా దక్కించుకోవడమే కాకుండా మిగతా దుకాణాలను కూడా గుప్పెట్లో పెట్టుకుని సిండికేట్‌గా నడుపుతున్నారు. గుడి, బడి అని చూడకుండా దుకాణాలు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేపట్టి అదనపు దోపిడీ చేస్తున్నారు. బెల్ట్‌షాపులకైతే లోటే లేదు. విచ్చల విడిగా ఏర్పాటు చేసి మందుబాబులను మద్యం మత్తులో ముంచేస్తున్నారు. అంతటితో ఆగలేదు. కల్తీ లిక్కర్‌ స్థావరాలు కూడా ఈ నియోజకవర్గంలోనే తొలుత బయటపడ్డాయి. కేసులు కూడా నమోదయ్యాయంటే ఎంత దారుణంగా కల్తీ బాగోతం నడిచిందో అర్థం చేసు కోవచ్చు. ఉపాధి హమీ పథకం పనుల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. నాసిరకం పనులు చేసి బిల్లులు కొట్టేసారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రశ్నిస్తే కేసులే..

ఈ మొత్తం అక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించే వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. వీటిని లిఖిత పూర్వకంగా, ఆధారాల వీడియోలతో కలిపి సామాజిక కార్యకర్త, శ్రీముఖలింగం అనువంశిక అర్చకులు నాయుడు గారి రాజశేఖర్‌ ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ జరుగుతున్నదంతా ఫిర్యాదులో ప్రస్తావించారు. సమగ్రంగా వివరించారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్వీకరించింది. తమ డైరీలో రిజిస్టర్‌ చేసి, నంబర్‌ కూడా ఇచ్చింది. దీనిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నది వేచి చూడాల్సి ఉంది.

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి వెళ్లిన వ్యవహారాలు

ఇసుక, మద్యం మాఫియాలపై ఫిర్యాదు

ధన దాహానికి మంచినీటి పథకాలు నిర్వీర్యమవుతున్నాయంటూ ఫిర్యాదులో ప్రస్తావన

నరసన్నపేట ఎమ్మెల్యేపై చేసిన ఫిర్యాదును స్వీకరించిన

జాతీయ మానవ హక్కుల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement