● ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో పథకం నిలుపుదల
● బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల డిమాండ్
● ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆరోగ్యశ్రీ చికిత్సలు నిలుపుదల
శ్రీకాకుళం : జిల్లాలోని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత కొంతకాలంగా తమ బకాయిలను చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పదేపదే విన్నవిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం నుంచి ప్రత్యక్ష పోరాటానికి నిశ్చయించాయి. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నారు. జిల్లాలో 20 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివే యాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. వైఎస్సార్ మానస పుత్రికగా పేరొందిన ఆరోగ్య శ్రీని ఎలాగైనా నిలిపివేయా లని చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచో కుట్రలు పన్నుతోంది. ఆరోగ్యశ్రీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. ఏప్రిల్ నుంచి కొత్తగా యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురావాలని కూడా నిర్ణయించారు. కానీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతూ తొలిదశగా ఆరోగ్యశ్రీని నిలుపుదల చేయాలని నిర్ణయించారు.


