● బడి ముఖద్వారంపై ‘గరిమెళ్ల’కు బదులు టీడీపీ నేతల పేర్లు
● చెరిపివేసిన గుర్తు తెలియని వ్యక్తులు
● ప్రియాగ్రహారంలో రాజుకున్న రాజకీయం
పోలాకి: ఆ బడి ముఖద్వారంపై ఇదివరకు స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ పేరు ఉండేది. ఈ మధ్య ఏం పనులు చేశారో గానీ అదే స్థానంలో స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. స్వాతంత్య్ర యోధుడి పేరు స్థానంలో వీరి పేర్లు పెట్టుకోవడంతో కొందరు వాటిని చెరిపేశారు. ఇప్పుడు ఈ వైనం మండలంలోని ప్రియాగ్రహారంలో నిప్పు రాజేసింది. పాఠశాల ముఖద్వారంపై రాసిన పేర్లు చెరిపేశారంటూ టీడీపీకి చెందిన నాయకులు సోమవారం సాయంత్రం పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామానికి చెందిన పలువురు యువకులను పోలీసులు మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు. అందులో జనసేన, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు టీడీపీ రెబల్‌గా మారిన దుబ్బ కోటేశ్వరరావు కూడా ఉన్నారు. పేర్లను ఎవరు చెరిపారో కనుక్కోకుండా తమను బెదిరించడం సరికాదని వారన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బలగ ప్రవీణ్‌తోపాటు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు సుంకరి రాంబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తియ్యల రాము స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టకుండా కేవలం టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను స్టేషన్‌కు పిలిపించడంపై నిలదీశారు. అనంతరం అక్కడి నుంచి యువకులను వారి వెంట తీసుకెళ్లిపోయారు.
టీడీపీ నాయకులు కూటమి ధర్మం పాటించడం లే దని, కనీసం అధికారంలో తాము భాగస్వాములం అనే విషయాన్ని పక్కన పెట్టారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల గేట్లపై రాజకీయ నాయకుల పేర్లు రాయటం తగదని అన్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సైతం తీవ్రంగానే స్పందించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ పేరుతో పాఠశాల ముఖద్వారం ఉండేదని, ఆ స్థానంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం ఆక్షేపణీయమని జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య మండిపడ్డారు.


