శ్రీకాకుళం: జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన ’అక్షర ఆంధ్ర – ఉల్లాస్’ కార్యక్రమం ఎంతో కీలకమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమి క స్థాయి అక్షరాస్యత పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకుల హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,462 కేంద్రాల్లో 1,13,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే ‘అక్షర ఆంధ్ర’ యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


