● డ్రోన్‌లు, పెట్రోలింగ్ బృందాలతో భద్రతా ఏర్పాట్లు
● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, డ్రోన్ కెమెరాలు, పెట్రోలింగ్ బృందాలతో పటిష్ట నిఘా పెట్టనున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. 145 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు జరగనుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట పోలీసు బందోబస్తు పెట్టామన్నారు. ఇప్పటికే శాఖాపరంగా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశామన్నారు.
144 సెక్షన్ అమలు..
పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపా రు. సజావుగా జరిగేలా పోలీసు, విద్యాశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో చర్య లు చేపట్టాలని, కేంద్రాల లోపలకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఐప్యాడ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదని, హాజరయ్యే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. సిబ్బంది తప్ప సమీప ప్రాంతాల్లో ఇతరులు ఉండకుండా చూడాలని, జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షలు పూర్తయ్యేవరకు తెరవరాదని అన్నారు. మాస్ కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా అధికారులు చూ డాలని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని ఎస్పీ సూచించారు.


