● గుడ్లు పొదిగేందుకు వచ్చి చనిపోతున్న తాబేళ్లు
● నిషేధిత వలలు, బోట్లకు తగిలి మృత్యువాత
● అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లే తాబేళ్లు
వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలోని సముద్ర తీరం తాబేళ్ల పాలిట మరుభూమిగా మారుతోంది. మత్స్యకారులు చేపలను వేట చేసేందుకు నిషేధిత వలలు, బోటులను వినియోగించడంతో సముద్ర జలాల్లో సంచరిస్తున్న తాబేళ్లు గాయపడి మృతి చెందుతున్నాయి. రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతూ సముద్ర తీరాలకు వాటి కళేబరాలు కొట్టుకువస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. దీంతో అత్యధిక సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబే ళ్లు తన సంతానోత్పత్తికి అవసరమైన గుడ్లు పొది గేందుకు అనువుగా ఉండే సముద్ర తీరాలకు చేరుకుంటాయి. జిల్లాలో ప్రధానంగా వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, ఇచ్ఛాపురం, కవిటి, మందస, రణస్థలం, గార మండలాల్లో గల చినకొత్తూరు, మోట్టూరు, డోకులపాడు, అక్కుపల్లి, హుకుంపేట, మంచినీళ్లపేట, భావనపాడు, కళింగపట్నం, డొంకూరు, కేవీ పాలెం, డీఎల్‌పురం, రట్టి, బారువ, ఇసుకలపాలెం, తోటూరు, గొలగండి, దేవునల్తాడ తదితర సముద్ర తీరాలకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు చేరుకుంటాయి.
మరణ మృదంగం
సముద్ర సమతుల్యాన్ని కాపాడటంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల పాత్ర కీలకం. అలాంటి అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. ఏటా డిసెంబర్ మొదలు కొని ఏప్రిల్ వరకు వేలాది సంఖ్యలో తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం సముద్ర తీరాలకు వస్తాయి. అనువైన ప్రాంతాలలో లక్షలాది గుడ్లను పొదిగి తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే నిషేధిత వలలు, బోట్లకు తగిలి మృత్యువాత పడుతున్నాయి. తీరాలకు చేరిన తాబేళ్ల కళేబరాలను వీధి కుక్కలు, పక్షులు పీక్కు తింటున్నాయి. వీటి గుడ్లకు సైతం సంరక్షణ లేక పక్షులు తినేస్తున్నాయి. మిగిలిన గుడ్లను ట్రీ స్వచ్ఛంద సంస్థ, అటవీశాఖ సయుక్తంగా సంరక్షిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
8 కిలోమీటర్లు దాటి వెళ్లాలి..
దేశంలో అనువైన తీర ప్రాంతాలకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు గుడ్లు పొది గేందుకు వస్తాయి. ఈ సమయంలో మత్స్యకారులు 8 కిలోమీటర్లు దాటించి చేపల వేట సాగించాలి. నిషేధిత వలలు, బోట్లు వాడరాదు. వీటిని నిషేధించగలితే తాబేళ్లను రక్షించగలం. మత్స్యకార శాఖాధికారులు, మత్స్యకారులు దీనికి పూర్తి బాధ్యత వహించాలి.
– మురళీకృష్ణంనాయుడు,
అటవీశాఖ రేంజర్, కాశీబుగ్గ


