డోలోత్సవానికి వేళాయె..! | - | Sakshi
Sakshi News home page

డోలోత్సవానికి వేళాయె..!

Mar 3 2026 7:21 AM | Updated on Mar 3 2026 7:21 AM

దర్శనంతో ముక్తి సులువు దర్శనానికి ఏర్పాట్లు

మూడు రోజుల పాటు కూర్మనాథుని డోలోత్సవాలు

నేటి రాత్రి కామ దహనోత్సవం

అధిక సంఖ్యలో దర్శించుకోనున్న భక్తులు

గార: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయంలో మంగళవారం నుంచి డోలోత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి. తొలిరోజు రాత్రి 10 గంటల నుంచి కామ దహనోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఏటా పాల్గుణ మాస త్రయోదశి నాడు మాఘ నక్షత్రంలో జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం గ్రామ సమీపంలోని కామ దహన మంటపం వద్ద కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనసులోని చెడు ఆలోచనలు పటాపంచలవుతాయని, మంచి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామ దహనోత్సవం ముగిసిన తర్వాత బుధవారం వేకువజాము నుంచి సమీప ఎస్‌.మత్స్యలేశం తీరంలో భక్తులు పవిత్ర స్నానాలచరిస్తారు. మరలా ఆలయంలోని శ్వేత పుష్కరిణిలో పవిత్ర స్నానాలాచరిస్తారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి మూర్తులను మేళతాళాలతో ఊరేగించి, గ్రామదేవత ఆలయం సమీపంలోని డోలో మంటపం వద్దకు తీసుకెళ్లి ఉత్తరాభిముఖంగా స్వామిని వేంజేసింపజేసి బుక్కాభర్గుండతో పూజలు చేస్తారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.

ఇదీ చరిత్ర..

విష్ణుమూర్తి దశావతారాల్లో రెండో అవతారం తాబేలు(కూర్మం) రూపం. ఇక్కడ మూలవిరాట్‌ను బ్రహ్మ ప్రతిష్టించారని, రాత్రి వేళల్లో దేవతల నిత్యార్చన, పగలు మానవ అర్చనలు జరుగుతుంటాయని చెబుతారు. ఆలయం ఎదురుగానున్న శ్వేత పుష్కరిణి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తవ్వగా.. అందులో గరుడ వాహనంపై ఉన్న లక్ష్మీదేవి విగ్రహం లభ్యమై ఆలయంలో కూర్మనాయకిగా కొలువుంది. ఈ ఆలయం కృతయుగంలో నిర్మితమవ్వగా.. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యులు తన దిగ్విజయ యాత్ర సందర్భంగా దీన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చారని, ఈ విజయానికి చిహ్నంగా పశ్చిమాన విజయ స్థూపాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్ధంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామివారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యుల సందర్శన, 13వ శతాబ్ధంలో మద్వాచార్యులు శ్రీనరహరితీర్థుల క్షేత్రాన్ని సందర్శించి సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను బహుకరించారు. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ దేవాలయం అపురూప శిల్పకళతో ఉంటుంది. 108 రాతి స్తంభాలు ఒకదానితో ఇంకొకటి పోలిక ఉండవు. 600 ఏళ్లనాటి ఆకుపసర చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

పితృమోక్ష క్షేత్రం

క్షేత్రం ఆవరణలోని శ్వేత పుష్కరిణిలో చనిపోయిన పెద్దల అస్తికలను కలిపితే ముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఇందులో కలిపిన మానవ అస్తికలు కొద్ది రోజుల్లో శిలలుగా మారుతాయని భావిస్తారు.

మానవుల కోర్కెలు దహించి, స్వామివారిని చేరే అద్భుత ఘట్టమైన కామదహనోత్సవంలో భక్తులు పాల్గొని, సముద్ర స్నానాలాచరించి, స్వామివారిని ఉత్తరాభిముఖంగా దర్శిస్తే ముక్తి లభిస్తుందని క్షేత్ర ప్రాశస్త్యం. మూడు రోజుల ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలి.

– సీహెచ్‌ సీతారామనృసింహాచార్యులు,

ఆలయ ప్రధానార్చకులు, శ్రీకూర్మనాథాలయం

మూడు రోజుల పాటు నిర్వహించే ఈ డోలోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఉచిత క్యూలైన్‌ను ఆలయం వెనుక వైపు నుంచి ఏర్పాటు చేశాం. ప్రత్యేక దర్శనం వద్ద అదనపు క్యూలైన్లు ఏర్పాటు జరిగింది. లడ్డూ, పులిహోర ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం.

– టి.వాసుదేవరావు, ఆలయ ఈవో,

శ్రీకూర్మనాథాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement