అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి

Mar 3 2026 7:21 AM | Updated on Mar 3 2026 7:21 AM

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పీజీఆర్‌ఎస్‌కు 99 వినతులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అర్జీదారుల నుంచి వచ్చే వినతులను త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్జీలకు క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, ప్రతి అర్జీదారుడికి సంతృప్తికరమైన సమాధానం అందాలని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్‌ శాఖకు 19, సెర్ప్‌ విభాగంలో 13, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలో 10 వినతులు అందాయి. అలాగే జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌ శాఖలకు సంబంధించి చెరో 4 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 3 ఫిర్యాదులు అందాయి. ఆర్టీసీ, సర్వే సెటిల్‌మెంట్స్‌, బీసీ సంక్షేమం, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలపై రెండేసి చొప్పున వినతులు వచ్చాయి. వీటితో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఎన్టీఆర్‌ వైద్య సేవ, కాలుష్య నియంత్రణ మండలి సహా మొత్తం 22 విభాగాలకు చెందిన సమస్యలను ప్రజలు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే గ్రీవెన్స్‌ హాల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రెవెన్యూ క్లినిక్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు. మండలాల వారీగా ఏర్పాటు చేసిన డెస్క్‌ల వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను స్వయంగా పరిశీలించారు. అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందితో కలిసి చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

భయానక పరిస్థితులు నెలకొన్నాయి

శ్రీకాకుళం నుంచి ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడకు వెళ్లే రోడ్డులో వంతెన వద్ద ఇటీవల భయానక పరిస్థితులు నెలకొన్నాయని కొంగరాం, ముద్దాడ, వెంకన్నగారిపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. పొన్నాడ తర్వాత సుమారుగా పది గ్రామాలు ఉన్నాయని, వారంతా పగలు, రాత్రి ఆ మార్గం గుండానే ప్రయాణాలు చేస్తుంటారని తెలిపారు. ఇటీవల ఆ బిడ్జి సమీపంలో హత్యలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన అధికారులు స్పందించి ప్రజల భద్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement