సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామంలో త్రినాథస్వామి ఆలయ 69వ వార్షికోత్సవంలో భాగంగా జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. 80 కిలోల విసురుగుండు పోటీల్లో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, గేదెల రమణ ద్వితీయ బహుమతి పొందారు. అలాగే 100 కిలోల తీత సంగిడి పోటీల్లో గేదెల సత్యనారాయణ ప్రథమ, ఆవల గోవిందరావు ద్వితీయ బహుమతులు పొందారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆవల గోవిందరావు, ముద్దాడ తరుణ్ కుమార్‌లు ఇద్దరు 160 కిలోలు ఎత్తడంతో ఇద్దరికీ ప్రథమ స్థానం, బిల్లాడ యోగేశ్వరరావును ద్వితీయ స్థానానికి ఎంపిక చేశారు. అలాగే బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆడవరానికి చెందిన గుజ్జల వర్షిత 103 కిలోలు ఎత్తి ప్రథమ స్థానం, 95 కిలోలు ఎత్తి దూబ హేమశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. 203 కిలోల ఈడ్పు గుండు పోటీల్లో ఆవల గోవిందరావు ప్రథమ స్థానం సాధించారు.


