గట్టి చేతలు!
ఎన్నో ప్రయోజనాలు..
చిట్టి చేతులు..
● చిన్ననాటి నుంచే సమాజ సేవ ● పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు ● సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ● పాఠశాలల్లో మెరుగుపడనున్న సౌకర్యాలు
హిరమండలం: నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలలను ఏర్పాటుచేసింది. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రతి పీఎంశ్రీ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటుచేస్తున్నారు. సేవాభావంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు, సమాజంలో నడవడిక తదితర రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 81 పీఎంశ్రీ పాఠశాలలను ఎంపికచేసి ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. తొలి విడతలో ఎంపికై న 32, రెండో విడతలో ఎంపికై న 3 పాఠశాలలకు నిధులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చుతుంది. ఇప్పటివరకూ ఆ రెండు విడతల్లో రూ.4.2 కోట్లు నిధులు వెచ్చించినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకో మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో పాఠశాలల ఎంపిక జరగలేదు. ఇప్పుడు ఏడో విడతలో మాత్రం ఏకంగా 81 పాఠశాలలను ఎంపిక చేసినట్టు సమాచారం. తొలి రెండు విడతల్లో ఎంపిక చేసిన 35 పాఠశాలల్లో పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి.
దేశభక్తి పెంచేలా..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 35 పాఠశాలలకు సంబంధించి స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ఇప్పటికే ఏర్పాటుచేశారు. ఇందుకుగాను ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు వంతున కేటాయించారు. పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. ఇందుకు రూ.5 వేలు కేటాయించారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను, మెలకువలను విద్యార్థులతో చేయిస్తారు. ఇప్పటికే దాదాపు 800 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరారు. ఈ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యతలను తీసుకుంటారు. దేవాలయాల వార్షికోత్సవాలు, వివిధ వేడుకల సమయంలో వచ్చే భక్తులను క్యూలైన్‌లో వెళ్లేలా పర్యవేక్షిస్తారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేస్తారు. స్వాతంత్ర దినోత్సవాలు, రిపబ్లిక్‌డే వేడుకల్లో భాగస్థులవుతారు. అయితే ప్రాథమిక స్థాయి నుంచే సేవ, దేశభక్తి అలవరచడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయంటున్నారు వ్యక్తిత్వ నిపుణులు. కేంద్ర ప్రభుత్వం ఏటా మరిన్ని పాఠశాలలను పీఎంశ్రీకు ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేయడం శుభ పరిణామం.
సమగ్ర వసతులు..
పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రధానంగా క్రీడాంశాలకు ప్రాధాన్యమిస్తారు. క్రీడా కోర్టులు, రన్నింగ్ ట్రాక్‌లతో పాటు మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంకుడు గుంతలు, కిచెన్ గార్డులు, ఉద్యానాలు, రక్షణ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. తరగతి గదులకు సంబంధించి ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రయోగశాలలో పరికరాలు, గ్రంథాలయాల్లో పుస్తకాలు ఏర్పాటుచేస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. యూనిఫాం అందిస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తున్నారు. పాఠశాల నిర్వహణకు సైతం ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగుతోంది.
విద్యార్థి దశలోనే వ్యక్తిత్వ వికాసం కలిగించాలన్నది పీఎంశ్రీ పాఠశాలల లక్ష్యం. దేశభక్తి, సమాజ సేవను ప్రాథమిక స్థాయిలో అలవరచాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు సైతం అలవడుతాయి. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయి.
– కె.రాంబాబు
ఎంఈఓ, హిరమండలం
గట్టి చేతలు!
గట్టి చేతలు!


