అధికారులను బలి పశువులు చేస్తున్నారు
● వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: జిల్లా కేంద్రంలో ఇటీవల నామమాత్రంగా చేసిన వివిధ రకాల పనులకు సంబంధించి అడ్డగోలుగా బిల్లులు పాస్ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌లు అధికారులపై ఒత్తిడి చేశారని, దానికి నిరాకరించడంతో డయేరియా పేరుతో వేటు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం టెక్కలిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో డయేరియా వ్యాప్తి విషయంలో కొత్తగా విధుల్లోకి వచ్చిన రోణంకి కూర్మనాథ్‌పై వేటు వేయడం వెనుక మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన వివిధ రకాల పనుల విషయంలో బిల్లుల మంజూరులో గతంలో పనిచేసిన కమిషనర్‌పై ఒత్తిడి చేశారని, ఆయన నిరాకరించడంతో పాత కమిషనర్‌ను హఠాత్తుగా బదిలీ చేశారని ఆరోపించారు. ఆ తర్వాత కమిషనర్‌గా రోణంకి కూర్మనాథ్ విధుల్లోకి చేరడంతో అతనిపై కూడా బిల్లుల కోసం ఒత్తిడి చేశారని, ఆయన సైతం నిరాకరించడంతో డయేరియా వ్యాప్తి నెపంతో అతనిపై సైతం వేటు వేశారని దుయ్యబట్టారు. ఆ తర్వాత మరో అధికారిని నియమించారని, ఈ నియామకంపై జిల్లావ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తుడంతో మరో అధికారిని నియమించారని పేర్కొన్నారు. అడ్డగోలుగా బిల్లులు మంజూరు చేసే విషయంలో నాయకులు అధికారులను బలి పశువులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


