‘రియల్’ దందా..!
● పాలనాయుడుపేటలో అక్రమ లే అవుట్
● కోర్టు పరిధిలో ఉన్నా అనధికార అమ్మకాలు
● గ్రామకంఠం భూమి ఆక్రమించారని గ్రామస్తుల ఫిర్యాదు
సంతబొమ్మాళి: రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉందని, గ్రామకంఠం భూమి ఆక్రమించారని వేర్వేరుగా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో పెట్రేగిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్‌పీ నంబర్ 324, 325లో 80 సెంట్ల భూమిలో లే అవుట్‌ను వేశారు. ఈ లే అవుట్‌కు ఎటువంటి పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకపోయినా.. దర్జాగా రోడ్లువేసి ఫ్లాట్లుగా విభజించి సరిహద్దు రాళ్లను పాతారు. ఈ సర్వే నంబర్‌పై డిస్ప్యూట్ ఉండడంతో పలువురు కోర్టులో కేసు వేశారు. కోర్టు కాపీతో పాటు భూపత్రాలతో స్పందనలో తహసీల్దార్ హేమసుందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. మరోపక్క గ్రామకంఠం భూమి ఆక్రమించి లేఅవుట్ వేశారని గ్రామానికి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు పిన్నింటి ఎండయ్య రెడ్డి గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సర్వే నంబర్‌పై ఇన్ని ఫిర్యాదులు ఉన్నా మూలపేట పోర్టును బూచిగా చూపించి లేఅవుట్‌ను ఫ్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపడుతున్నారు. ఈ తతంగం అంతా అధికారులకు తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందువలన ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ హేమసుందరరావును వివరణ కోరగా లే అవుట్‌ను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


