ప్రజారోగ్యంతో చెలగాటం
● చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు అధ్వానం
● వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త
పేరాడ తిలక్
టెక్కలి: చంద్రబాబు పాలనలో నీళ్లు, పాలు కల్తీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడు తూ అధికారం చేపట్టినప్పటి నుంచి అడ్డదారిలో ఎలా దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప చిత్తశుద్ధిగా ప్రజా సంక్షేమం కోసం పాలన అందజేయడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న ప్రతిసారీ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని తిలక్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా పదవుల ను ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన సంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదని తిలక్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ వ్యవహారం, ఇందాపూర్–హెరిటేజ్ ఒప్పందాలపై శాసనమండలిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నిలదీసే క్రమంలో అధికార పార్టీ సభ్యులు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అమరావతిలో భూ మాఫియా చేస్తున్నారని ఆ విషయం బయటకు తెలియకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యవసరమైన పాలు కల్తీ జరిగి ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, దీనిపై హెరిటేజ్ సంస్థలో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని తిలక్ నిలదీశారు. కేవలం నామమాత్రంగా కొన్ని డెయిరీల్లో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో మంచినీరు సైతం కల్తీ జరిగి డయేరియా విజృంభించి ప్రాణాలు కోల్పోతుంటే, మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఆటలు ఆడుకుంటున్నారని తిలక్ ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలో ప్రతి క్షణం డయేరియా నివారణ చర్యల్లో పనిచేయాల్సిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు.


