భారీ ట్యూమర్ తొలగింపు
శ్రీకాకుళం క్రైమ్: అప్పటికే గుండెకు బైపాస్ సర్జరీ జరిగిన 78 ఏళ్ల వృద్ధురాలి పొత్తి కడుపులో పెరిగిన 10 కిలోల బరువున్న భారీ ట్యూమర్‌ను శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. దీనికి సంబంధించి సర్జికల్ అంకాలజిస్టు డాక్టర్ బమ్మిడి సందీప్ మాట్లాడుతూ రోగిలో ట్యూమర్ పరిమాణం పెద్దదిగా ఉండడంతో పొత్తి కడుపులోని ఇతర అవయవాలపై ఒత్తిడి పెరిగి ప్రాణాపాయం జరిగేదన్నారు. వృద్ధురాలు కావడం, అప్పటికే గుండె బైపాస్ సర్జరీ జరిగి ఉండటంతో మళ్లీ శస్త్ర చికిత్స చేయడం హైరిస్క్‌గా భావించామని, అయినప్పటికీ బహుళ విభాగాల వైద్య బృందం సమన్వయంతో ట్యూమర్‌ను తొలగించగలిగామని చెప్పారు. శస్త్ర చికిత్సకు ముందు గుండె పనితీరును పూర్తిగా అంచనా వేసి, ఆపరేషన్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రస్తుతం గుండె పనితీరు స్థిరంగా ఉందన్నారు.
రేపు జిల్లాస్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఆర్చరీ అసోసియేషన్, డీఎస్‌ఏ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి లోపింటి చిట్టిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అరసవల్లి రోడ్డులోని ఆదిత్య ఆర్చరీ అకాడమీ, కొయ్యన కన్నయ్యనగర్ వేదికగా ఎంపిక పోటీలు ఉదయం 10.30 గంటల నుంచి మొదలవుతాయని చెప్పారు. మినీ అండర్ –10, అండర్–13, అండర్ –15, ఇండియన్ రౌండ్, రికర్వే, కాంపౌండ్ విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. కృష్ణ జిల్లా నూజివీడులో ఈనెల 11వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలను ఇక్కడ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, నాలుగు పాస్ ఫొటోలు, ఎంట్రీ ఫీజుతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 94406 77201, 99899 78727 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
బూర్జ: మండలంలోని ఓవీపేట గ్రామానికి చెందిన సాకేటి అమ్మన్నమ్మ (58) విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. స్థానిక పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 25వ తేదీన సాయంకాలం వర్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఆమె వెలుగు కోసం కొవ్వొత్తి వెలిగించింది. వెలిగించిన కొవ్వొత్తి దుస్తులకు అంటుకోవడంతో ప్రమాదంతో ఆమె శరీరం కాలిపోయింది. వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెకు వివాహమైన కూతురు, కొడుకు ఉన్నారు. ఫిర్యాదు మేరకు స్థానిక ఇన్‌చార్జి ఎస్‌ఐ బి.హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
ఇచ్ఛాపురం: పట్టణంలో గత 15 ఏళ్లుగా తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తున్న పైడి డిల్లేశ్వరరావు(50) అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన డిల్లేశ్వరరావు తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తుండేవాడు. ఇతను స్థానికంగా పనులు చేసుకుంటూ స్వగ్రామంలో ఉంటున్న కుటుంబ సభ్యులకు డబ్బులు పంపేవాడు. ఈ క్రమంలో ఇతని ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసేందుకు కొంతమొత్తంలో పట్టణంలో అప్పులు చేశాడు. తాను చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోవడంతో చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. అనంతరం పట్టణంలోని సురంగిరాజావారి కోట వెనుక భాగంలో ఉన్న తోటలో చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. చెట్టుకి వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి మృతదేహాన్ని తరలించారు. పట్టణ ఎస్‌ఐ ముకుందరావు కేసు నమోదు చేశారు.


