సంక్షేమం లేదు.. అభివృద్ధి జరగడం లేదు
● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
పాతపట్నం: రాష్ట్రంలో రెండేళ్లుగా ఎటువంటి సంక్షేమం లేదని, అలాగే అభివృద్ధి జరగడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. పాతపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, సంపద సృష్టిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన సీఎం చంద్రబాబు, ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సంపద సృష్టి మాట దేవుడెరుగు.. అప్పుల్లో మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 20 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, ఇతర సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డీబీటీ పద్ధతిలో ఐదేళ్లలో ఏకంగా రూ.2,73,756 కోట్లు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందాయని గుర్తు చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో మెళియాపుట్టి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


