ఇవేం పనులు..?
● అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
● కొరవడిన పర్యవేక్షణ
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ను అమృత్ భారత్ రైల్వేస్టేషన్‌గా ఎంపిక చేసి ఏడాది కాలంగా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా స్టేషన్ వెనుక భాగంలో గదుల నిర్మాణాలకు పిల్లర్లు వేశారు. అయితే పిల్లర్స్ మధ్యలో నిబంధనల ప్రకారం ఇసుకతో గానీ.. కంకరతో గానీ ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా, స్టేషన్ పక్కనుంచి పారుతున్న మురుగు కాలువలో మట్టిని తీసి వేస్తున్నారు. దీంతో పనులు నాణ్యత దెబ్బతింటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి కనుసైగలతో నిర్వహిస్తున్న ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని అంటున్నారు. ఈ పనుల పర్యవేక్షణలో రైల్వే అధికారులు కూడా మంత్రి ఆదేశాలతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవనం నిర్మాణ సమయంలో పునాది లెవెల్‌లో ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే భవిష్యత్‌లో భవనాలు కూలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా కాంట్రాక్టర్‌కు కాసులు మిగలడంతో పాటు తాబేదారులకు ముడుపులు చెల్లించేందుకు ఇలాంటి మురికి మట్టిని ఫిల్లింగ్ చేసి నాసిరకం పనులు చేస్తున్నట్లు ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఈ పనులపై సమగ్రమైన పరిశీలన జరిపి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు నిర్వహించాలని కోరుతున్నారు.


