చేపల ఉత్పత్తులతో అధిక లాభాలు
ఆమదాలవలస: చేపలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో అధిక లాభాలు పొందవచ్చునని శాస్త్రవేత్త, శిక్షణా నిపుణులు డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ కోటేశ్వర్‌లు సూచించారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి మరియు కృషి విజ్ఞాన కేంద్రంలో చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై 5 రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. చేపలు, రొయ్యలు పరిశుభ్ర పరిస్థితుల్లో పెంపకాలు చేపడితే వాటి నాణ్యత తక్కువ కాకుండా ఉంటుందని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చేపలను వివిధ రూపాలలో నాణ్యత కోల్పోకుండా మార్కెట్ చేసుకోవడం ద్వారా మత్స్యకారులకు ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ చేపలు మానవ ఆహారంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయన్నారు. నాణ్యతగా వినియోగదారులకు అందించే విధానాన్ని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.


