ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాల్సిందే
● చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం
● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాల విభజనలో ఐటీడీఏను కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాకు మెళియాపుట్టి కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. ఐటీడీఏ ఏర్పాటుపై గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్ఛాపురం నుంచి కొత్తూరు వరకున్న ఆదివాసీల కోసం ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. చంద్రబాబు దీనిపై హామీ ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు. అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. ధర్నాకు సంఘీభావంగా బహుజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు పాటల తూట ఉదయభాస్కర్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు పాల్గొన్నారు.


