భక్తిశ్రద్ధలతో కూర్మనాథుని తిరువీధి
గార: డోలోత్సవం ముందు ఫాల్గుణ దశమి పురస్కరించుకొని శ్రీకూర్మనాథుని తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధలతో గురువారం నిర్వహించారు. సాయంత్రం శ్రీకూర్మనాథాలయం నుంచి రెండు పల్లకీలపై శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, సీతారామ లక్ష్మణులను మాడవీధుల్లో ఊరేగించారు. రావివలస నాయుడు మంటపం వద్ద వేంచిపచేసిన అర్చక బృందం నాయుడు గోత్రనామాలతో ప్రత్యేక పూజలతో పాటు విష్ణుసహస్ర నామ పారాయణం జరిపారు. అనంతరం ఆలయం నుంచి వచ్చిన నైవేద్యాన్ని సమర్పించి, మంగళశాసనాలు జరిపారు. కార్యక్రమంలో ఈఓ టి.వాసుదేవరావు, ఆలయ ప్రధానార్చకులు సీహెచ్. సీతారామనృసింహాచార్యులు, కూర్మినాయుడు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, కిషోర్‌బాబు భక్తులు పాల్గొన్నారు.


