దేవునల్తాడలో విషాదం
వజ్రపుకొత్తూరు రూరల్: దేవునల్తాడ గ్రామానికి చెందిన వలస కూలి బుడగట్ల మోహన్‌రావు(46) దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెంది 17 రోజుల తర్వాత బుధవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకోవడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. నాలుగు నెలల క్రితం అదే కుటుంబానికి చెందిన మృతుని సోదరుడు బుడగట్ల చినబాబు సముద్రంలో తెప్ప బోల్తా పడి మృతి చెందారు. పొట్ట చేతపట్టుకొని ఎన్నో ఆశలతో వలసకూలీగా దుబాయ్ వెళ్లిన మోహన్‌రావు నేడు విగతజీవిగా గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోహన్‌రావుకు భార్య ధనలక్ష్మీ, కుమారులు రాజేష్, నితిన్ ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మృతితో రోడ్డున పడిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


