అధికారికంగా ఒకరే..
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలిన అతిసారంపై సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అతిసారం కారణంగా అధికారికంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మిగిలిన మరణాలకు గల ఇతర కారణాలను విశ్లేషిస్తున్నామని, పరిస్థితిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తోందని తెలిపారు. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు 50కి పైగా వైద్య బందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాధి మూలాలను గుర్తించేందుకు సచివాలయ సిబ్బంది, ఆశా/ఏఎన్‌ఎంలతో కూడిన బృందాలు ఇంటింటికీ వె ళ్లి సర్వే నిర్వహిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.
రోగులకు మంత్రి నారాయణ పరామర్శ
శ్రీకాకుళం: శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణం గుర్తించేందుకు రాష్ట్రస్థాయి నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆయన బుధవారం శ్రీకాకుళంలో పర్యటించి బాధితులను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వ్యాధి ప్రబలడా నికి కారణం నీరు కలుషితం కావడమా.. ఆహారంలో ఎక్కడైనా కల్తీ జరిగిందా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. గురువారానికి వివరాలు తెలుస్తాయన్నారు. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. ఇందులో 19 మంది డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఒకరికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని మీడియా ప్రశ్నించగా మరొకరికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక వచ్చిన వెంటనే మరణానికి కల కారణాన్ని తెలుసుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు.
నగరంలో అతిసార వ్యాప్తికి కారణమైన పాత తాగునీటి పైపులైన్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేస్తా మని మంత్రి పి.నారాయణ తెలిపారు. సమీక్ష సమా వేశంలో మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ ల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం తక్షణమే రూ. 12 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ. 2 కోట్లను అతిసార ప్రభావిత ప్రాంతాల్లోని కచ్చా డ్రైన్ల పనుల కోసం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 60 కోట్లతో చేపట్టే పనులను మార్చి నెలలో మొదలు పెడతామని స్పష్టం చేశారు. నిలిచిపోయిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల కోసం రూ. 23 కోట్లు, అమృత్–1 పథకం కింద డ్రైనేజీల నెట్‌వర్క్ కోసం రూ. 35 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


