● మృతుల సంఖ్య ప్రకటనపై అస్పష్టత
శ్రీకాకుళం: నగరంలో డయేరియా బారిన పడి మత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినా అది బాధితులందరికీ అందే అవకాశం లేకుండాపోతోంది. వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు వాంతులు విరేచనాలతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. అందులో ఎం.సంతోష్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం చనిపోయారు. అప్పటికి వ్యాధి తీవ్రత గురించి ఇంత హడావుడి లేదు. సోమవారం మధ్యాహ్నం సరికి వ్యాధి ప్రబలినట్లు జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి తెలిసింది. సోమవారం ఉదయం మడ్డు లక్ష్మణ అనే వ్య క్తి కూడా వాంతులు విరేచనాలతోనే చనిపోయారు. అప్పటికి కూడా వ్యాధి ప్రబలిన విషయాన్ని గుట్టుగానే ఉంచారు. వ్యాధి తీవ్రత గురించి బయటకు చెప్పాక మండల సురేష్, సదాశివుని నర్సింగరావు మంగళవారం మధ్యాహ్నం మృతిచెందారు. వీరిలో సురేష్ సోమవారం సాయంత్రం నుంచి రిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం 11 గంటల సమయంలో మృతిచెందారు. నర్సింగరావు ఓ ప్రైవేటు క్లినిక్ లో చికిత్స పొంది ఇంటి వద్దనే దాన్ని కొనసాగిస్తూ ఉండగా మంగళవారం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థి తి విషమించింది. దీంతో నర్సింగరావును కుటుంబ సభ్యులు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారానే రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయి తే వీరిలో సురేష్ మాత్రమే డయేరియాతో మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మిగిలిన వారే కారణాలతో చనిపోయారని చెబుతున్నారు. నర్సింగరావు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే దాన్ని మధ్యలో ఆపిమరీ పోలీసులు, కార్పొరేషన్ అధికారులు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అయినా ఆయన పేరు ప్రకటించలేదు. అధికారులు పునరాలోచించి బాధితులకు అందాల్సిన ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు.


