సజావుగా సీనియర్ ఇంటర్ పరీక్షలు
● తొలిరోజు 19158 మందికిగాను
318 మంది గైర్హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాలో సీనియర్ ఇంటర్ పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి. సెట్–2 ప్రశ్నాపత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒరియా పేపర్లకు పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు రెండోరోజు జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 19,158 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18840 (98.34) మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 318 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 18057 మందికి 291 మంది, ఒకేషనల్‌లో 1101 మందికి 27 మంది డుమ్మా కొట్టారు. జిల్లా డీవీఈఓ/ ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్, డీఈసీ–1 బొమ్మలాట శ్యామ్‌సుందర్‌ల బృందం శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, మునసబ్‌పేటలోని గాయిత్రి జూనియర్ కాలేజ్, ఆ సమీపంలోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. డీఈసీ–2 సిరిపురం భీమేశ్వరరావు.. టెక్కలి, నందిగాం ప్రాంతాల్లోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండోరోజు పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదుకాలేని ఆర్‌ఐఓ సురేష్‌కుమార్ ధ్రువీకరించారు.


