జయక్క జీవితం స్ఫూర్తిదాయకం
పలాస: శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన వీరనారి పోతనపల్లి జయమ్మ జీవితం విప్లవకారులకు స్ఫూర్తిదాయకమని సి.పి.ఐ.ఎం.ఎల్.న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోలా ఈశ్వరరావు అన్నారు.పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద మంగళవారం పోతనపల్లి జయమ్మ 6వ వర్ధంతి సభ నిర్వహించారు. న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, కులవ్యవస్థ పెరిగిపోయిందని, అన్ని రకాలు దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం అరుణపతాకాన్ని జయమ్మ కుమారుడు మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల మల్లేశ్వరరావు, తామాడ సన్యాసిరావు, పత్తిరి దానేసు, జోగి కోదండరావు, కొర్రాయి నీలకంఠం, సాలిన వీరాస్వామి, పుచ్చ దుర్యోధన, సామాజిక కార్యకర్త పోతనపల్లి అరుణ, కొమర వాసు, గొరకల బాలకృష్ణ, కృష్ణవేణి, పోతనపల్లి కుసుమ, ఈశ్వరమ్మ, సొర్ర రామారావు, కుత్తుం వినోద్, నాగమణి, సార జగన్ తదితరులు పాల్గొన్నారు.


