శాసనసభలో సంతాప తీర్మానం
శ్రీకాకుళం: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతికి శాసనసభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గుండ కుటుంబానికి తీవ్ర అవమానం పేరిట మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని కొందరు సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం వెళ్లడంతో మాజీ ప్రజాప్రతినిధుల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఏడుగురు మాజీ శాసనసభ్యులు మృతికి సంతాప తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టారు. సీనియర్ నాయకుడు మృతి చెందడం పట్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించకపోయినా ఏదోలా రాష్ట్ర పార్టీ నాయకుల దృష్టికి వెళ్లి ఆ కుటుంబాన్ని గౌరవ పరిచేలా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం పట్ల తెలుగుదేశం వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
టెక్నీషియన్ శిక్షణకు ఎంపికలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సీడాప్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విసిని స్కిల్ అకాడమీ, డీడీయూ– జీకేవై, యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ నేతృత్వంలో సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్ టెక్నీషియన్, మల్టీ స్కిల్ టెక్నీషియన్, కన్జూమర్ డ్యూరబుల్స్‌లో శిక్షణ పొందేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పథక సంచాలకుడు పి.కిరణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న మందస మండలం కుంటికోటలో యువత శిక్షణ కేంద్రంలో ఉదయం 9.30 గంటలకు ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి కనీస విద్యార్హత కలిగిన 18–35 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవవచ్చన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, శిక్షణ మెటీరియల్, సర్టిఫికెట్ అందిస్తామని, వివరాలకు 9390339833 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


