పీఏసీఎస్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. వీరికి రాజేశ్వరరరావు సంఘీభావం తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తాత్సారం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్నేని పాపినాయుడు, మెండ సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి సన్యాసిరావు, కనుగుల రమణ, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.


