నేడు ‘డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీ’
సాక్షి, విశాఖపట్నం : డిస్కమ్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో నేడు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ప్రకటించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్ పాడేరు, రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు 8688400499 ఫోన్ నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్‌న్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సీఎండి పృథ్వీతేజ్ విజ్ఞప్తి చేశారు.
చైన్నెలో అచ్చుతాపురం వ్యక్తి మృతి
పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధి అచ్చుతాపురం గ్రామానికి చెందిన సలాన సోమేశ్వరరావు(41) చైన్నెలో శనివారం ఉదయం సెంట్రింగ్ పనులు చేస్తూ, మూడో అంతస్తు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని చైన్నెలో అతనితో పనిచేసేవారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం మృతదేహం గ్రామానికి తీసుకురావడంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోమేశ్వరరావుకు భార్య లక్ష్మి, కుమారుడు సాయిచరణ్‌లు ఉన్నారు.
కారం చల్లి బంగారం
చోరీ
నందిగాం: చెరువుకు స్నానానికి వెళ్తున్న మహిళ కంట్లో కారం చల్లి మెడలో పుస్తెలతాడు, గొలుసు చోరీ చేసిన ఘటన మండలంలోని నర్సిపురంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి గొడెబందకు స్నానానికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కంట్లో కారం చల్లాడు. అనంతరం మెడలో ఉన్న పుస్తెల తాడు, గొలుసును లాక్కొని వెళ్లిపోయాడు. దీంతో ఏడ్చుకుంటూ గ్రామానికి చేరుకున్న మహలక్ష్మి, విషయం గ్రామస్తులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహాలక్ష్మి భర్త పార్వతీశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు ‘డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీ’


