71 కేంద్రాలు.. 39,838 మంది విద్యార్థులు
● రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ● నో సెల్‌ఫోన్ జోన్లుగా పరీక్ష కేంద్రాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు, కలెక్టర్ సూచనల మేరకు జిల్లా ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్‌సుందర్, ఎస్.భీమేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావు ఇతర అధికా రులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్ల విషయ మై జిల్లా ఆర్‌ఐఓ సురేష్‌కుమార్ శనివారం సాయంత్రం సీఎస్‌లు, డీఓలతో మరోసారి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. 9 గంటల తర్వాత నిమి షం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు అర్ధగంట ముందుగా చేరుకునేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాలను రాష్ట్రప్రభుత్వం నో సెల్‌ఫోన్ జోన్‌లుగా ప్రకటించింది. విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు, సీఎస్‌లు, డీఓలు, కస్టోడియన్లు, స్క్వాడ్ లు, చివరకు తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్‌ఫోన్లు పరీక్ష కేంద్రం వెలుపలే ఉంచాలి. అవసరాల కోసం పరీక్ష కేంద్రానికి ఒకటి చొప్పున కీప్యాడ్ ఫోన్లను, సిమ్‌లను అధికారులు అందజేశారు. ఈ ఫోన్లు సీఎస్‌ల పర్యవేక్షణలో ఉండనున్నాయి. జిల్లా లో 71 కేంద్రాల్లో 39,838 మంది ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్స రం 19,850 మంది, ద్వితీయ సంవత్సరం 19,988 మంది ఉన్నారు. జిల్లాకు ఇప్పటికే మూడు సెట్లతో కూడిన ప్రశ్న పత్రాలు చేరగా.. వీటిని 31 స్టోరేజ్ పాయింట్లలో బందోబస్తు నడుమ భద్రపరిచారు. 1480 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.


